తుమ్మలపై కాంగ్రెస్‌లో పెరుగుతున్న వ్యతిరేకత.. కీలక నేత గుడ్ బై చెప్పే అవకాశం!

by Disha Web Desk 2 |
తుమ్మలపై కాంగ్రెస్‌లో పెరుగుతున్న వ్యతిరేకత.. కీలక నేత గుడ్ బై చెప్పే అవకాశం!
X

దిశ బ్యూరో, ఖమ్మం: సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకాలం బీఆర్ఎస్‌లో అవకాశం వస్తుందని భావించి వెయిట్ చేసిన తుమ్మల.. కనుచూపుమేర అవకాశాలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆ పార్టీ నాయకులే కొందరు ఆరోపిస్తున్నారు. తాజాగా పీసీసీ సభ్యుడు, పాలేరు నియోజకవర్గ ఆశావహ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు తుమ్మలపై విరుచుకుపడ్డారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని చూశారు..

బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనే సంకల్పంతో పనిచేశారని, ఆ పార్టీకి చెందిన వివిధ హోదాల్లో నాయకులను నయానో, భయానో బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. రూరల్ మండలంలో తన అనుచరున్ని కొందరు హత్య చేస్తే నిందితులకు శిక్ష పడకుండా చేసి, ఎవరైతే చంపారో వారికి ప్రభుత్వం గన్ మెన్లను ఇచ్చినా చూస్తూ ఊరుకున్న వ్యక్తి మనల్ని కాపాడుతాడా? రక్షిస్తాడా? అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా పుట్టిన కాంగ్రెస్ పార్టీ.. అనేక దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన తుమ్మల కాంగ్రెస్ జెండా గిట్టని తుమ్మల ఇప్పుడు ఈ పార్టీలో ఉండటం అవసరమా అంటూ విమర్శించారు. కేవలం రాజకీయ స్వార్థంతోనే తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆయన వల్ల పార్టీకి ఒరిగేది ఏమీ లేదని రాయల స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌లోకి రాయల?

మొదట సీపీఎంలో తర్వాత పీఆర్పీలో పనిచేసిన రాయల వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి క్రియాశీలకంగా పనిచేసి పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీలో పీసీసీ సభ్యునిగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తుమ్మల కాంగ్రెస్‌లో చేరడం.. రాజకీయ సమీకరణలు మారడంతో రాయల ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో రాయల నాగేశ్వరరావు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని, బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని ఆయన అనుచరులు అంటున్నారు.

Read More..

కేంద్ర నిర్ణయంతో కన్‌ఫ్యూజన్‌లో టీ కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపికకు బ్రేక్..?


Next Story

Most Viewed