అంత తొందరెందుకు? మూడు వారాలు ఆగలేరా?.. బీఆర్ఎస్ ప్లాన్‌కు ఈసీ బ్రేక్!

by Disha Web Desk 2 |
అంత తొందరెందుకు? మూడు వారాలు ఆగలేరా?.. బీఆర్ఎస్ ప్లాన్‌కు ఈసీ బ్రేక్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సమయంలో ఎంప్లాయీస్ ను మచ్చిక చేసుకునేందుకు బీఆర్ఎస్ వేసిన ప్లాన్‌కు ఈసీ బ్రేకులు వేసింది. ఏడాదిగా పెండింగ్‌లో పెట్టిన అంశం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా?అని కామెంట్ చేసినట్టు తెలిసింది. ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈ మధ్య ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. అయితే ఆ డీఏ ఎప్పటిది? ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది? అని వివరాలను తెలుసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడే ఎందుకు అంత తొందర? అని ప్రశ్నించినట్టు సమాచారం.

ఏడాది క్రితం డీఏ ఇప్పుడే ఇవ్వలా?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 2022 జులై నెలకు చెందిన డీఏను ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ అనుమతి కోసం ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖపై కేంద్రనిఘా సంస్థల ద్వారా పూర్వోపరాలు తెలుసుకుని, ఈసీ సెటైర్‌గా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఏడాదిగా పెండింగ్‌లో పెట్టిన డీఏను ఇప్పుడే ఎందుకు ఇస్తున్నట్టు? మరో మూడువారాల పాటు ఆగలేరా? అంత తొందరేమిటీ? అని ప్రశ్నించినట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

సానుభూతి కోసం ప్లాన్

పోలింగ్‌కు ముందు డీఏను విడుదల చేస్తే, ఎంప్లాయీస్‌లో కొందరైనా తమకు అనుకూలంగా ఓటు వేస్తారనే ప్లాన్‌లో రూలింగ్ పార్టీ ఉన్నట్టు అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో బుధవారం ఎంప్లాయీస్ ప్రతినిధులు సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసి డీఏ రిలీజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు. అయితే డీఏ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసినా, ఎన్నికల సంఘం క్లియరెన్స్ ఇవ్వలేదని సానుభూతి పొందేందుకు రూలింగ్ పార్టీ ఎంప్లాయీస్ ప్రతినిధులను పావులుగా వాడుకుందా? అనే చర్చ జరుగుతున్నది.

Next Story