బీఆర్ఎస్‌కు క్లిష్ట పరిస్థితి.. బీజేపీపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించే చాన్స్?

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్‌కు క్లిష్ట పరిస్థితి.. బీజేపీపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించే చాన్స్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి పౌర‌స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) బిల్లు సంకటంగా మారింది. ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడుతున్నది. దీనికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే ఒక రకమైన చిక్కులు.. ఇవ్వకుంటే మరో రకమైన సమస్యలు ఎదురుకానున్నాయి. ఓటింగ్‌లో పాల్గొని బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడమా?.. లేక వ్యతిరేకంగా వ్యవహరించడమా?.. లేదంటే సైలెంట్‌గా బహిష్కరణ పేరుతో ఓటింగ్‌కు దూరంగా ఉండడమా? అనే అంశాలు బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ బిల్లుపై ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. వారం రోజుల్లో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించే చాన్స్ ఉన్నది.

సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ఈ బిల్లుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోడానికి రాజకీయపరంగా కొన్ని చిక్కులు ఎదుర్కొంటున్నది. ఈ బిల్లుకు మద్దతు పలికితే ముస్లిం మైనారిటీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశమున్నది. ఇప్పటికే మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దీన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిల్లుకు మద్దతు పలికి ముస్లిం ఓటు బ్యాంకును దూరం చేసుకోవడం బీఆర్ఎస్ పార్టీకి సవాలు లాంటిదే. ఈ కారణంగా బిల్లుకు మద్దతు ఇవ్వకూడదనే అభిప్రాయం గులాబీ నేతల నుంచి వ్యక్తమవుతున్నది. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. సివిల్ కోడ్ బిల్లుపై పార్టీ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, మేధావులతో చర్చించిన తర్వాత ఖరారవుతుందని వ్యాఖ్యానించారు.

గతంలో పలు బిల్లులకు మద్దతు పలికిన బీఆర్ఎస్.. మరికొన్నింటి విషయంలో ఓటింగ్‌కు దూరంగా ఉన్నది. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులపై ఓటింగ్ జరిగే సమయంలో పాల్గొనకుండా బహిష్కరించింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా సహకారం అందించిందనే ఆరోపణలను ఎదుర్కొన్నది. మరి సివిల్ కోడ్ బిల్లు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏ నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఆ పార్టీకి కీలకంగా మారింది. బీజేపీకి ‘బీ-టీమ్‘గా వ్యవహరిస్తున్నదంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న సమయంలో నిర్ణయం తీసుకోవడం బీఆర్ఎస్ అధినేతకు సవాలుగా మారింది. మద్దతు పలికినా, వ్యతిరేకించినా, ఓటింగ్‌కు దూరంగా ఉన్నా ఏదో ఒక రకమైన ఆరోపణలను ఎదుర్కోక తప్పదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లును వ్యతిరేకించినట్లయితే కాంగ్రెస్‌తో లోపాయకారీ సంబంధాల్లో ఉన్నదని బీజేపీ ఆరోపణలు చేయడానికి ఆస్కారమున్నది.

గతంలోనూ ఆరోపణలు

గతంలో అదానీ విషయంలో హిండెన్‌బర్గ్ రిపోర్టుపై చర్చ జరగాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యయనానికి అప్పగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిన సమయంలో ఆ పార్టీతో కలిసి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. కాంగ్రెస్‌తో కలిసి సంయుక్త నిరసనల్లో పాల్గొన్నది. దీంతో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ దగ్గరవుతున్నదని బీజేపీ నుంచి ఆరోపణలను ఎదుర్కొన్నది. అదే సమయంలో బీజేపీకి ‘బీ-టీమ్’గా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తుండడంతో అది నిజం కాదని తనకు తాను నిరూపించుకోడానికి ఈ బిల్లును గులాబీ పార్టీ వ్యతిరేకించే చాన్స్ ఉన్నది.

ఇతర పార్టీల సపోర్ట్

ఈ బిల్లుకు లోక్‌సభలో బీజేపీ సులభంగానే ఆమోదం పొందగలిగినా రాజ్యసభలో మాత్రం ఇతర పార్టీల నుంచి మద్దతు అనివార్యం కానున్నది. మొత్తం 245 మంది సభ్యులుండే రాజ్యసభలో ఎనిమిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సభలో బీజేపీకి సొంతంగా 92 మంది, కూటమి పార్టీల నుంచి మరో 11 మంది మద్దతు ఉన్నది. దీనికి తోడు ఐదుగురు నామినేటెడ్ సభ్యులు, మరో స్వతంత్ర అభ్యర్థి సహకారం లభిస్తుందని కమలం పార్టీ నమ్మకంతో ఉన్నది. దీంతో మొత్తంగా 109 మంది సభ్యుల బలం ఉన్నట్లయింది. బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీకి 119 మంది ఓట్లు అవసరం. మిగిలిన పది మంది సభ్యుల మద్దతును వైఎస్సార్సీపీ (9 మంది), బిజూ జనతాదళ్ (9 మంది), అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ (ముగ్గురు), తెలుగుదేశం (ఒకరు) నుంచి పొందాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఆప్ అంగీకారం

ఇప్పటికే ఈ బిల్లుకు సూత్రప్రాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ అంగీకారం తెలిపింది. ఆ పార్టీకి రాజ్యసభలో పది మంది సభ్యులున్నారు. ఓటింగ్ సమయానికి మద్దతు పలికే చాన్స్ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురి మద్దతు బీజేపీకి అవసరం లేకుండా పోయింది. దీంతో బీ-టీమ్ కాదని రుజువు చేసుకోడానికి బిల్లుకు వ్యతిరేకంగానే ఓటింగ్ చేసే అవకాశాలున్నాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ఇంకా పది రోజుల సమయం ఉన్నందున ఈ నెల 18 నాటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటు సభ్యులతో సమావేశమై బిల్లుపై అనుసరించాల్సిన వైఖరి గురించి స్పష్టత ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ మద్దతు అనివార్యమేమీ కానందున బీజేపీ నుంచి సహకారం కోసం రిక్వెస్టు వచ్చే అవకాశమూ లేదు.

Next Story

Most Viewed