ఊహకందని బీజేపీ వ్యూహం.. పవన్ కల్యాణ్ నిర్ణయంపై వీడని సస్పెన్స్!

by Disha Web Desk 2 |
ఊహకందని బీజేపీ వ్యూహం.. పవన్ కల్యాణ్ నిర్ణయంపై వీడని సస్పెన్స్!
X

బీజేపీ ఎత్తుగడలతో ఏపీ రాజకీయాలు ఏ రోజు ఏ మలుపు తీసుకుంటాయో ఊహకే అందడం లేదు. తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేయడం ద్వారా రాష్ట్రంలో ఆ పార్టీకి, టీడీపీ మధ్య కుంపట్లు రాజెయ్యాలని భావిస్తున్నట్లుంది. అక్కడ సెటిలర్లు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని ఈపాటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జనసేనానిని ముందు పెట్టడం ద్వారా వాళ్లను కాంగ్రెస్​వైపు వెళ్లనీయకుండా కమలనాథులు స్కెచ్​వేశారా? పవన్​ఒక్క సీటూ గెలవకుంటే ఇక్కడ కాపు, కమ్మ మైత్రికి బీటలు పడవా? కాషాయ పార్టీ లక్ష్యం అదేనా! ఇది పరోక్షంగా వైసీపీకి మేలు చేసే వ్యూహమంటూ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి సింగిల్ డిజిట్​కన్నా ఎక్కువ సీట్లు రాకపోవచ్చని పలు జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు వెనుక సీఎం జగన్‌కు బీజేపీ సహకారం ఉందని దేశమంతా కోడై కూస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు తలాతోక లేకుండా ఇచ్చిన నివేదికలతోనే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్​చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తెలంగాణలోని సెటిలర్లు​మొత్తం బీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​వైపు వీళ్లను మొగ్గు చూపకుండా చేయడం కోసమే జనసేనను ముందుకు నెట్టాలనేది కాషాయ పార్టీ వ్యూహమై ఉండొచ్చని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

సెటిలర్ల ఓట్ల కోసమేనా?..

కమలనాథులతో కలిసి పోటీ చేయడం వల్ల పవన్​కు చేకూరే ప్రయోజనం కనిపించడం లేదు. జనసేన ఓట్లు కలిస్తే బీజేపీ కనీసం కొన్ని సీట్లయినా సాధించుకోవడానికి దోహదపడుతుంది. తెలంగాణలో సెటిలర్లు​ ప్రభావం చూపే నియోజకవర్గాల్లో బీజేపీ వ్యూహాత్మకంగా జనసేనను పోటీకి దింపే అవకాశాలున్నాయి. ఏపీలో టీడీపీతో జనసేన పొత్తులో ఉన్నందున సెటిలర్ల​ ఓట్లు పడతాయని భావిస్తున్నారు. అక్కడ టీడీపీ పోటీ చేయకపోతే ఆ ఓట్లన్నీ జనసేనకు పడతాయని ఆశ పడుతున్నారు. ఒకవేళ సెటిలర్లు కాంగ్రెస్​ కు జై కొడితే ఆ ప్రభావం ఏపీలోని కమ్మ, కాపు సామాజిక వర్గాల మైత్రికి గండి కొట్టే ప్రమాదముంది. ఇది ఊహించే కాషాయ పార్టీ జనసేనను పావులా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

జనసేనకు నష్టం.. బీజేపీకి లాభం..

తెలంగాణలో పోటీ చేయడం ద్వారా జనసేనకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. బీజేపీకి మాత్రం రెండు విధాలా ఉపయోగపడుతుంది. టీడీపీ పోటీ చేయకుంటే ఆ పార్టీ ఓట్లతోపాటు జనసేన ఓట్లతో బీజేపీ కొన్ని సీట్లయినా పెంచుకోవడానికి దోహదపడుతుంది. ఒకవేళ టీడీపీ ఓటింగ్​ మొత్తం కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపితే ఏపీలో జనసేనతో టీడీపీ పొత్తును చిత్తు చేయొచ్చు. పరోక్షంగా అది వైసీపీకి మేలు చేసినట్లవుతుంది. కాషాయ పార్టీ వదిలిన బాణంలా పవన్​మారతారా.. లేక స్వతంత్రంగా ఆలోచించి ఏపీలో పార్టీ ప్రయోజనాలకే కట్టుబడతారా అనే సస్పెన్స్​కొనసాగుతోంది.Next Story

Most Viewed