ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ కీలక హామీ!

by GSrikanth |
ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ కీలక హామీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉపాధ్యాయ అభ్యర్థులను సీఎం కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని టీకాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన శీధర్ బాబు.. గడిచిన 9 ఏళ్లుగా ఈ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. సీఎం అసెంబ్లీలో చెప్పినట్లు 13 వేల పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురాబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ఆచరణ సాధ్యం కాదని కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. సాధ్యం అవుతుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ప్రకటించామన్నారు.

ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పిందన్నారు. ఉద్యోగుల ఇబ్బందులపై తమ కమిటీలో ప్రధానంగా చర్చించామన్నారు. ఉద్యోగులకు జిల్లాకో తేదీన జీతాలు పడుతున్నాయని.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నెలాలంభంలోనే జీతాలు ఇచ్చామో తాము అధికారంలోకి వస్తే అదేరీతిగా జీతాలు అందజేస్తామన్నారు. ఓపీఎస్‌ను మేనిఫెస్టోలో పెట్టేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఈ అవినీతిని రూపుమాపితే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే డబ్బు సరిపోతుందన్నారు. రాష్ట్రంలో గడిచిన 9 ఏళ్లుగా మెఘా కృష్ణారెడ్డి ఒక్కరికి సంబంధించిన బిల్లుల లెక్కలు తీస్తే వాటితో సగం సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అన్నారు. పేదలపై పన్నుల భారం వేయకుండా ఏ విధంగా రెవెన్యూ సాధించవచ్చో చూపించబోతున్నామని ఇందుకోసం కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లతో పాటు మరికొన్ని అనేక అంశాలపై ఇంకా కూలంకశంగా చర్చిస్తున్నామని అన్నింటిపై చర్చించాక ప్రజల ముందు ఉంచబోతున్నామన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో ఇచ్చిన హామీ ప్రకారం అన్నింటిని నెరవేరుస్తున్నామని అంతకు ముందు ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను సెట్ రైట్ చేసుకుంటూ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని దీనిపై కేటీఆర్, హరీశ్ రావులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Next Story