బీజేపీలో చేరికలకు పక్కా స్కెచ్.. క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసా?

by GSrikanth |   ( Updated:2023-07-29 23:30:34.0  )
బీజేపీలో చేరికలకు పక్కా స్కెచ్.. క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొన్నటి వరకు చేరికలు లేక సతమతమైన బీజేపీలో క్రమంగా జాయినింగ్స్ పెరుగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత డీలా పడిన పార్టీ జాయినింగ్స్‌తో తమ సత్తా ఏంటో చూపించాలని డిసైడ్ అయింది. అలాగే రాష్ట్ర నాయకత్వం మార్పు అనంతరం భారీ ఎత్తున చేరికలకు ప్లాన్ చేసుకుంది. దాదాపు 15 నుంచి 20 మంది వరకు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాషాయ పార్టీలోకి చేర్చుకోవాలని రాష్ట్ర నాయకత్వం చూస్తోంది. అందులో భాగంగా శనివారం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ జైపాల్ రెడ్డిని ఢిల్లీ వేదికగా జాతీయ నేతల సమక్షంలో పార్టీలోకి చేర్చుకుంది. ఇదే తరహాలో మరికొందరు నేతలను లాగేందుకు బీజేపీ స్కెచ్ వేసింది.

పార్టీలో జాయినింగ్స్‌తో మునుపటి జోష్ కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కాగా సోమవారం మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావుతో పాటు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తయినట్లు వినికిడి. ఇప్పటికే వారు శనివారం మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఆయనతో భేటీ అయ్యారని సమాచారం. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారు చేరుతారని తెలిసింది. ఇదిలా ఉండగా జాయినింగ్స్‌పై కాషాయ పార్టీ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎలాంటి లీకులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ముందే తెలిస్తే పార్టీ మారుతారనే భయంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ కాషాయ గూటికి చేరాలని చూస్తున్నట్లు సమాచారం. ఆమె ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయినట్లు టాక్. 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పని చేసిన జయసుధ అనంతరం రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరుతారనే ప్రచారం గతంలోనూ జరిగింది. అనూహ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమె పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు కిషన్ రెడ్డితో పార్టీలో చేరే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆమె చేరిక దాదాపు ఖాయమని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. వారం రోజుల్లో ఆమె ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారని పార్టీ వర్గాల నుంచి సమాచారం. ముషీరాబాద్ నుంచి కానీ సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కానీ పోటీ చేయాలని ఆమె చూస్తున్నట్లు వినికిడి. ఆమె కండీషన్స్‌కు రాష్ట్ర నాయకత్వం సానుకూలంగా స్పందిచినట్లు చెబుతున్నారు.

మాజీ మంత్రి కృష్ణయాదవ్ కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్. ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే సీటు విషయంలో కాస్త తకరారు ఉండటంతో చేరిక విషయమై ఫైనల్ కాలేదని సమాచారం. మలక్‌పేట లేదా అంబర్‌పేట్ సీటు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. పూర్తిస్థాయి హామీ లభించకపోవడంతో ఊగిసలాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆయనపై స్టాంప్స్ కుంభకోణం కేసు ఉంది. జైలుకు సైతం వెళ్లి వచ్చాడు. ఇదిలా ఉండగా జయసుధ, కృష్ణయాదవ్ కాకుండా మారో ముగ్గురు నేతలు సైతం చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వారం పదిరోజుల్లో మరో 8 మంది ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఢిల్లీ వేదికగా జాతీయ నేతల సమక్షంలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. అయితే వారి పేర్లు రివీల్ చేయకుండా బీజేపీ సస్పెన్స్‌లో పెట్టింది. చేరే వరకు సీక్రెట్‌గా ఉంచాలని చూస్తోంది.

జయసుధ సీటు విషయంతో బీజేపీలో వర్గ పోరు ఎక్కువవుతుందేమోనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జయసుధకు ముషీరాబాద్ టికెట్ అంటూ బీజేపీలో ప్రచారం జరుగుతుండటంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ముషీరాబాద్ టికెట్‌ను తన అనుచరులకు ఇప్పించుకోవాలనుకుంటోన్న ఎంపీ లక్ష్మణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ముషీరాబాద్ నుంచి తన కుమార్తెను బరిలో దింపాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ భావిస్తున్నారు. కానీ, జయసుధను చేర్చుకుని ముషీరాబాద్ టికెట్ ఇచ్చినట్లయితే లక్ష్మణ్, దత్తాత్రేయకు.. కిషన్ రెడ్డి చెక్ పెట్టినట్లేనని చర్చ జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత లక్ష్మణ్, కిషన్ రెడ్డి మధ్య గ్యాప్ పెరిగినట్లుగా ఒక వర్గం నేతలు చెప్పుకుంటున్నారు. గతంలో పలుమార్లు బండికి లక్ష్మణ్ మద్దతు తెలపడంతోనే ఈ గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. అప్పట్లో డీకే అరుణకు చెక్ పెట్టేందుకు విజయశాంతిని కిషన్ రెడ్డి పార్టీలో తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. కాగా, తాజాగా.. విజయశాంతికి చెక్ పెట్టేందుకే జయసుధను చేర్చుకుంటున్నారనే ప్రచారం సైతం జోరుగా జరుగుతోంది. ఈ అంశం ఎంతటికి దారి తీస్తుందనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed