మందకృష్ణకు కౌంటర్.. ఎస్సీ, ఎస్టీలకు రేవంత్ రెడ్డి కీలక హామీ

by GSrikanth |
మందకృష్ణకు కౌంటర్.. ఎస్సీ, ఎస్టీలకు రేవంత్ రెడ్డి కీలక హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీతో పాటు ఎస్టీ వర్గీకరణను కూడా చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్గీకరణలు కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. వర్గీకరణ అనేది ఒకరి కోసం కాదని.. ఎస్సీ, ఎస్టీ ప్రజల కోసం చేస్తామన్నారు. వర్గీకరణ పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదన్నారు. ఒకరికి మద్దతిచ్చి ఇంకొకరిని ప్రశ్నించడం సరికాదని ఆయన మందకృష్ణ వ్యాఖ్యలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వర్గీకరణపై చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణలు చేసి రిజర్వేషన్లు పంచుతామన్నారు. వర్గాల మధ్య పంచాయితీలను తెంచుతామన్నారు. వర్గీకరణపై మందకృష్ణ మాదిగ కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​కిషన్ రెడ్డిని ఎందుకు అడగట్లేదు? అని రేవంత్ గుర్తుచేశారు. జనాభా ప్రకారం వర్గీకరణలు చేసి సమన్యాయం చేస్తామన్నారు. వర్గీకరణపై బీజేపీ కేంద్ర సర్కార్ వచ్చిన మొదటి టర్మ్‌లోనే గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయకుడు హామీ ఇచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా చేయలేదన్నారు.

జనరల్ సీట్లలోనూ..

దళిత, గిరిజనులను రాజకీయంగా ప్రాధాన్యత కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. రిజర్వేషన్ సీట్లలో కాకుండా జనరల్ సీట్లలో దళిత గిరిజనులకు అవసరాన్ని బట్టి సీట్లు కేటాయిస్తామన్నారు. ఈసారి ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో అమలు కాని ఫార్ములాలు తెలంగాణాలో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల ఫార్ములాలను తమకు అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌లో వరుస చేరికలు మొదలవుతాయన్నారు. ఆర్మూర్ నుండి బీజేపీ నేత వినయ్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.

బీఆర్ఎస్ భ్రష్టు సర్కార్..

బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రానికి పట్టిన భ్రష్టు అని రేవంత్ విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం. వడ్డీ సంగతి కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని, కానీ రైతులు, నిరుద్యోగులను న్యాయం చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామన్నారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. కేంద్రం గత ఏళ్లుగా స్లోగన్స్‌కు మాత్రమే పరిమితమైందని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. “దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది.. బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారు.. కానీ పెరిగింది.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు.. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.. మణిపూర్ మండుతుంటే మోడీ, అమిత్ షా కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారు. మణిపూర్‌లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సింది పోయి.. కాంగ్రెస్ ఓడించేందుకు ఈడీ, సీబీఐని పంపించారు. నియంతల కంటే నికృష్టాంగ మోడీ వ్యవహరిస్తున్నారు” అని కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ‘‘తిరగబడదాం.. తరిమికొడదాం’’ నినాదంతో ప్రజల్లోకి వెళదాం ప్రతీ గడపకు వెళ్లి.. ప్రతీ తలుపు తడదాం.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దామని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే నిరుద్యోగి మృతి..

‘‘ఏఈఈ, గ్రూప్స్‌కు 2020 నుంచి గూగులోతు రాజ్ కుమార్ అనే నిరుద్యోగి ప్రిపేర్ అవుతున్నారు. ఈ ఏడాది జనవరి 22న టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ పరీక్ష రాశాడు. బాగా రాశానంటూ హ్యాపీగా ఉన్నాడు. ఓపెన్‌లోనే జాబ్ గ్యారెంటీ అంటూ శ్రేయోభిలాశులకు చెప్పాడు. ఏఈఈ పేపర్ లీక్ అయిందనే సమాచారంతో రాజ్ కుమార్ కష్టం అంత వృథా అయ్యిందని కుమిలిపోయాడు. ఈ ఏడాది మే 21, 22 వ తేదీల్లో మరోసారి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించింది. మళ్లీ పరీక్ష రాశాడు. అతనికి మనో ధైర్యం లేకుండా పోయింది. ఉద్యోగం వస్తుందో రాదో అని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మట్టిలో మాణిక్యం లాంటి రాజ్​కుమార్ ఆత్మహత్య పాపం ఎవరిది? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed