ఇప్పటిదాకా పులుల్లా నిలడ్డారు.. ఇక మీ సమయం వచ్చేసింది: రాహుల్ గాంధీ

by Disha Web Desk 2 |
ఇప్పటిదాకా పులుల్లా నిలడ్డారు.. ఇక మీ సమయం వచ్చేసింది: రాహుల్ గాంధీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడి జనాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ వేవ్ ఉన్నదని స్పష్టంగా అర్థమవుతోందని, తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతున్నదని అన్నారు. గురువారం పెద్దపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో ప్రసంగించిన రాహుల్.. గడిచిన 10 ఏళ్లు కాంగ్రెస్ కార్యరకర్తలు పార్టీ జెండాను మోశారు. ఎన్నో రకాల అణిచివేతలు ఎదురైనా అయినా పులుల్లా నిలడ్డారు. ఇప్పుడు మీ సమయం వచ్చింది. ఒక్క అడుగు కూడా వెనకబడొద్దు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కేసీఆర్ దోపిడీని గ్రామగ్రామాల్లో తెలంగాణ తల్లులు, యువత, ఆడపిల్లలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి ఉన్నాయని.. ఇవి పరస్పరం సహాయం చేసుకుంటున్నాయన్నారు. సెక్యులరిజం కోసం కాంగ్రెస్ కొట్లాడుతోందని తెలంగాణ కలను నిజం చేయడమే తప్ప మధ్యలోనే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నారు:

తెలంగాణ ఏర్పాటుతో పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా ప్రజలు, రైతులు, కూలీలు, యువత కోసం రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్నారని కానీ కేసీఆర్ మాత్రం మాయమాటలతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. పదేళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని, కేసీఆర్ సీఎం తరహాలో కాకుండా రాజులా వ్యవహరిస్తూ ప్రజల సొమ్మును తన జేబులోకి వేసుకుంటున్నాడని ధ్వజెత్తారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలంటే నిధులు చాలవని కేసీఆర్ చెబుతున్నారని కానీ కేసీఆర్ జేబుల్లోకి వెళ్తున్న నిధులను తాము ప్రజలకు పంచిపెట్టబోతున్నట్లు చెప్పారు. కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి వల్ల ఎవరికి లాభం చేసూకూరిందని ప్రశ్నించారు. కంప్యూటరైజ్డ్ పేరుతో పేదల భూములను ఈ ప్రభుత్వం గుంజుకుందని, ధనవంతులకు మేలు చేసేందుకే రైతు బంధు తెచ్చారని ఆరోపించారు. బుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతులకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ చెప్పారని ఎవరికైనా జరిగిందా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే తొలిరోజే ఆరు గ్యారెంటీ స్కీమ్ లను అమలు చేస్తామని కర్నాటకలో ఇదే చేశాం. తెలంగాణలోనూ చేసి చూపుతామన్నారు. ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్లినా ఓబీసీల గురించి మాట్లాడుతారు. కానీ కులగణన గురించి మాట్లాడరని ధ్వజమెత్తారు. ఓబీసీకి నిజంగా మద్దతు పలుకుతున్నట్లయితే కుల గణన ఎందుకు చేపట్టరని ప్రశ్నించాను.

ఆ రెండు పార్టీల ఓట్లు కాంగ్రెస్ కే పడాలి:

కేసీఆర్, మోడీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని రాహుల్ ధ్వజెత్తారు. సింగరేణి గనులు ఆదానికి అమ్మే ప్రయత్నం జరిగిందని కానీ ఆ ప్రయత్నాలను మేము అడ్డుకున్నామని సింగరేణిని ప్రైవేటీకరణ చేయనివ్వమని భరోసా ఇచ్చారు. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్, బీజేపీలు సహకరించుకున్నాయని రాబోయే ఎన్నికల్లో బీజేపీ, మజ్లిస్‌కు పడే ఓట్లన్నీ కాంగ్రెస్‌కే పడాలన్నారు. ఢిల్లీలో బీజేపీని, ఇక్కడ బీఆర్ఎస్‌ను ఓడించి తీరాలన్నారు. తెలంగాణ ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఇది రాజకీయాలకు అతీతంగా ప్రేమ, కుటుంబంతో ఉన్న అనుబంధం లాంటిదన్నారు.

Next Story