కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ కసిరెడ్డి.. రేవంత్ ఇచ్చిన హామీ ఇదే!

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ కసిరెడ్డి.. రేవంత్ ఇచ్చిన హామీ ఇదే!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. మొన్నటి వరకు అధికార పార్టీ బీఆర్ఎస్‌లో టికెట్​దక్కుతుందని ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డికి భంగపాటు కలిగింది. దీంతో తమ అనుచరులు ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందేనంటూ కసిరెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం కసిరెడ్డితో చర్చలు జరిపినప్పటికీ క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్​పార్టీ స్థానిక మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు రేవంత్​రెడ్డిలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఢిల్లీ పెద్దల నుంచి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ స్థానం నుంచి వంశీచంద్​రెడ్డి పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ సీడబ్లూసీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండటంతో ఆయన సేవలు పార్టీ వినియోగించుకోవాలని అనుకుటుంది. అందుకోసం ఆ నియోజకవర్గంలో గెలుపు లక్ష్యంగా అభ్యర్థిని గుర్తించి కసిరెడ్డి నారాయణరెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరోసారి కసిరెడ్డి తమ అనుచరులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికార బీఆర్ఎస్​పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీలో కసిరెడ్డికి అవకాశం లేదు. ఒకవేళ పార్టీ బుజ్జగించిన ఫలితం ఉండదని తెలుస్తోంది. ఏది ఏమైనా కల్వకుర్తి అసెంబ్లీ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్​ అభ్యర్థిగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 29వ తేదీన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఢిల్లీ కాంగ్రెస్​పెద్దల సమక్షంలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. కసిరెడ్డి నారాయణరెడ్డి కారును వీడి కాంగ్రెస్‌లో చేరితే అధికార పార్టీకి గట్టి దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి మహాబూబ్​నగర్​ జిల్లాపై కసిరెడ్డి ప్రభావం భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story