కాంగ్రెస్ పదే పదే తెలంగాణ పోరాటాన్ని అవమానిస్తున్నది: మంత్రి

by GSrikanth |
కాంగ్రెస్ పదే పదే తెలంగాణ పోరాటాన్ని అవమానిస్తున్నది: మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగొచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ హామీలు, నేతల ప్రసంగాలపై మంత్రి స్పందించారు. సోమవారం సింగిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలు సుదీర్ఘ కాలంగా పోరాటం చేశారని.. కాంగ్రెస్ పార్టీ భిక్షతో ఈ రాష్టం ఏర్పడలేదని.. పోరాడి లాక్కున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఆత్మబలిదానాలు రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ చేసిన కాలయాపన ఫలితమేనని విమర్శించారు.

కాంగ్రెస్ పదే పదే తెలంగాణ పోరాటాలను అవమానిస్తున్నదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పి ఉద్యమించిన కేసీఆర్‌కు అండగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ చర్యలతో తెలంగాణ రెండు తరాల భవిష్యత్‌ను కోల్పోయిందని విమర్శించారు. తెలంగాణను ఎండబెట్టి, ప్రజలను వలసల పాలు చేసి ఆంధ్రాకు నీటిని తరలించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో వైఫల్యాల మూలంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉధృతమైందని అన్నారు.

Next Story

Most Viewed