హంతకుడే సంతాపం తెలిపిన‌ట్టుగా చిదంబరం తీరు: హరీష్ రావు

by GSrikanth |
హంతకుడే సంతాపం తెలిపిన‌ట్టుగా చిదంబరం తీరు: హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హంతకుడే సంతాపం తెలిపినట్లుగా కాంగ్రెస్ నేత పి.చిదంబరం తీరు ఉందని మంత్రి హరీష్ రావు సెటైర్ వేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం అంటే దొంగే దొంగ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి ఉద్యమించినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో చిదంబరం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలుగు మాట్లాడే వారంతా ఒక రాష్ట్రంగా ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని అంతకు ముందు తెలంగాణ స్టేట్ కాదు మద్రాస్ రాష్ట్రంగా ఉండేదని కేసీఆర్ కు చరిత్ర సరిగా తెలిసి ఉండదని చిదంబరం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హరీష్ రావు ఫైర్ అయ్యారు. చరిత్ర తెలియనిది కేసీఆర్ కు కాదని చిదంబరమే చరిత్ర తెలియకుండా వ్కర భాష్యాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారని విమర్శించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై చిదంబరం చేసి వ్యాఖ్యలు దుష్ప్రచారమే నా ఖండించారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో మెరుగ్గా ఉందని ఈ విషయం గ్రహించాలన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో ఆయన తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చిదంబరం అడిగితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదన్నారు. ఒకటి కాదు పదకొండు సార్లు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. చిదంబరంకు దమ్ముంటే తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలన్నారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసిన రాబోయే ఎన్నికల్లో ప్రజలు కేఆర్ వైపే ఉన్నారని బీఆర్ఎస్ పార్టీకే ప్రజల దీవెనలు ఉన్నాయన్నారు.

Next Story

Most Viewed