‘రేవంత్ రెడ్డి నా తమ్ముడు.. కేసీఆర్‌ను నమ్మి మోసపోయా’

by Disha Web Desk 2 |
‘రేవంత్ రెడ్డి నా తమ్ముడు.. కేసీఆర్‌ను నమ్మి మోసపోయా’
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను నమ్మి మోసపోయానని, ఆయనే నన్ను పిలిచి.. దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్‌ ఘాట్‌లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. 6 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ నన్ను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు దగ్గరకే ఈజీగా వెళ్లగలిగానని, కానీ, కేసీఆర్ మాత్రం సమయం ఇవ్వటం లేదని మండిపడ్డారు. దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో శుభ్రం చేసుకునే రకం కేసీఆర్ అని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్ స్పందించకుంటే బీఆర్ఎస్ పార్టీకే నష్టమన్నారు. తన మద్దతు లేకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ బలపడిందన్నారు. రేవంత్ రెడ్డి తన తమ్ముడు అని, ఆయనతో తనకు శత్రుత్వం లేదని వెల్లడించారు. 30 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ గెలుపోటములను ప్రభావితం చేస్తారని తెలిపారు.

చంద్రబాబు కుటుంబాన్ని చంపే ప్రయత్నం జరుగుతోందని, బాబు చనిపోతే తమకు ఎదురుండదని జగన్ భావిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే రాజమండ్రి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడతానని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్దమని, నాలుగు నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. 2019లో తాను జగన్‌ను గెలపించమని ప్రజలను కోరి పొరపాటు చేశానన్నారు. అప్పట్లో జగన్‌కు మద్దతు ఇచ్చినందుకు తల దించుకుంటున్నానన్నారు. ఎవర్ని ఎలా చంపాలి.. ఎలా అణిచివేయాలనేదే జగన్ ఆలోచన అని, సీఎం‌ జగన్‌కు నారా భువనేశ్వరి ఉసురు ఖచ్చితంగా తగులుతుందన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయటం దుర్మార్గమన్నారు.

సీఎం పదవి శాశ్వతం కాదన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలన్నారు. నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేయాలనుకోచటం అన్యాయమని, ముష్టి రూ. 371 కోట్లకు చంద్రబాబు ఆశపడతాడంటే ప్రజలు నమ్మటం లేదని అన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెడితే రాజకీయంగా జగన్‌కే నష్టమని, జగన్ మళ్ళీ గెలిస్తే.‌. ఆంధ్రప్రదేశ్ రావణకాష్టం కావటం ఖాయమన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి 151 కాదు.. నాలుగు సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తల్లి, చెల్లిని ఎన్నికల్లో వాడుకుని బయటకు పంపిన చరిత్ర జగన్‌దని విమర్శించారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా కట్టుబట్టలతో షర్మిలను బయటకు పంపారని, సొంత బాబాయ్‌ను చంపిన నేరస్తులను పట్టుకోలేని అసమర్ధుడు జగన్ అని దుయ్యబట్టారు. జగన్ కపట ప్రేమను దేవుడు కూడా క్షమించడని, జగన్ పాలనలో ఏపీలో దళితలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Next Story