కాంగ్రెస్‌ గెలిస్తే భట్టి విక్రమార్క సీఎం.. కేసీఆర్ రియాక్షన్ ఇదే!

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌ గెలిస్తే భట్టి విక్రమార్క సీఎం.. కేసీఆర్ రియాక్షన్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మదిరలో భట్టి విక్రమార్క గెలిచేది లేదు సీఎం అయ్యేది లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. మంగళవారం మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్.. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మధిర నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. నాకు ఎవరు దరఖాస్తు చేయకున్నా, భట్టి విక్రమార్క నన్ను అడగకున్నా దళితబంధు పైలట్ ప్రాజెక్ట్ కోసం చింతకాని మండలాన్ని నేనే ఎంపిక చేశానన్నారు. భట్టి విక్రమార్క నేనే సీఎం అవుతానని కొత్త డ్రామాకు తెరలేపాలని బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే లాభం జరుగుతుంది తప్ప భట్టి విక్రమార్కతో వచ్చేది లేదు పోయేది లేదన్నారు. పట్టింపు లేని భట్టి విక్రమార్కకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.

భట్టి విక్రమార్క మధిరకు ఆరు నెలలకు ఓ సారి చుట్టపు చూపుగా వచ్చిపోతుంటారని అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే నష్టమే అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళితబంధు వంటి కార్యక్రం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. వైన్స్ షాపులు, మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, ప్రభుత్వ పనుల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. పట్టింపు లేని భట్టి విక్రమార్కకు ఓటు వేస్తే మనకు వచ్చేదేందని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో డజన్ మంది సీఎంలు ఉన్నారని వారంతే గెలిచేది లేదన్నారు. కాంగ్రెస్ చెబుతున్నదంతా డంబాచారమే అని విమర్శించారు. ఒక్క దళితుడు కూడా భట్టి విక్రమార్కకు ఓటు వేయవద్దన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కరెంటు రాదు, నీళ్లు రావన్నారు.

రెండు సార్లు ఓడించినా మీపై అలగలేదు:

మమ్మల్ని రెండు సార్లు ఓడించినా ఇక్కడి ప్రజలపై మేము అలగలేదు. వివక్ష చూపలేదన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అని ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టి బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బందుల పాలు చేసిందే కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో మధిరలో కరెంటు ఉండేదా? అని ప్రశ్నించారు. రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు, తాము అధికారంలోకి వస్తే ధరణి తీసేసి భూమాత అమలు చేస్తామని భట్టి విక్రమార్క అంటున్నారు. అది భూమాతన భూమేతనా అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు రాష్ట్రం గురించి అవగాహనే లేదని విమర్శించారు. సీతారామసాగర్ పూర్తయితే మధిర నియోజకవర్గం వైపు కరువు తిరిగి చూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇవ్వకుండా బీఆర్ఎస్ ను చీల్చే ప్రయత్నం చేసిందని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో పండగల పంటలు పండుతున్నాయి. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. ఈ విషయం మనకు వ్యతిరేకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వమే చెప్పిన లెక్కలన్నారు. చిత్తశుద్ధి, అంకితభావంతో తెలంగాణ కోసం కృషి చేస్తున్నాం. మీ ఓటు మీ భవిష్యత్ తో పాటు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయిస్తుందన్నారు. అందువల్ల ఎన్నికల్లో సరైన అభ్యర్థికే మీ ఓటు వేయాలని కోరారు.

Next Story