- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
అసెంబ్లీ రద్దుకు ముహుర్తం ఖరారు.. కాంగ్రెస్‌కు ఊపిరాడనివ్వకుండా వ్యూహం!

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ రద్దు ఉండదని, ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని అధికార పార్టీ నేతలు బయటకు ఎంతగా చెబుతున్నా.. లోలోపల కసరత్తు మాత్రం ముందస్తు దిశగానే జరుగుతున్నది. ప్రత్యర్థి పార్టీల ఊహకు అందని విధంగా ఎన్నికల వ్యూహం రెడీ అవుతున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో గులాబీ బాస్ కౌంటర్ స్ట్రాటెజీపై దృష్టి పెట్టినట్టు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. గత నెల చివరి వారంలో కేటీఆర్ మూడు రోజుల పర్యటనతో ఈ వ్యూహం ఖరారైనట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షెడ్యూలు కంటే ముందే ఎన్నికలు జరిగే విధంగా కేంద్ర స్థాయిలో జరిగిన సంప్రదింపుల్లో అందుకు గ్రీన్ సిగ్నల్ రావడంతోనే మంచి ముహూర్తం చూసుకుని అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనకు గులాబీ అధినేత వచ్చినట్టు తెలిసింది.
ఎన్నికల కసరత్తు మొదలుపెట్టని బీజేపీ, కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల సన్నాహకాలు మొదలుపెట్టకముందే రాజకీయంగా దెబ్బ కొట్టాలన్నది గులాబీ బాస్ ప్లాన్. బీజేపీ ఇప్పటికీ ఇంకా ఎన్నికల కోసం ప్రాథమిక కసరత్తు కూడా మొదలు పెట్టలేదు. అంతర్గత సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వరుస మీటింగులతో ఎన్నికల స్ట్రాటెజీలపైనే మల్లగుల్లాలు పడుతున్నది. రెండు ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేస్తూ అడ్వాన్సు మోడ్‌లో ఉండి పైచేయి సాధించాలన్నది బీఆర్ఎస్ టార్గెట్. కేటీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత బీఆర్ఎస్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే సుమారు 80 మందితో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు రెడీ అయినట్టు ఆ పార్టీ స్టేట్ ఆఫీస్ వర్గాలు పేర్కొన్నాయి.
మోడీతో సయోధ్య కుదిరినట్లేనా?
కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో, మోడీతో కేసీఆర్‌కు కుదిరిన సయోధ్యతోనే ముందుస్తు దిశగా బీఆర్ఎస్ అడుగులు పడుతున్నట్టు తెలుస్తున్నది. ‘అసెంబ్లీని రద్దు చేస్తాం.. వెంటనే ఎన్నికలు జరిగేలా సహకరించండి..’ అనే తీరులో కేంద్ర పెద్దలతో జరిగిన సంప్రదింపుల్లో వారి నుంచి స్పష్టమైన హామీ లభించినట్టు సమాచారం. ఆ ప్రకారమే ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యేలోపే అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం, కొత్త స్కీమ్‌లను లాంఛనంగా ప్రారంభించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కేటీఆర్ భేటీ అయిన రెండు వారాల వ్యవధిలోనే ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వెళ్లి ఆ శాఖ అధికారులతో చర్చించారు. మరికొన్ని శాఖలకు సంబంధించిన అంశాలపైనా భేటీ అయ్యారు. ఇవన్నీ రెండు ప్రభుత్వాల మధ్య, రెండు పార్టీల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ పెరిగాయనేదానికి సంకేతమనే వార్తలు గులాబీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, అధికారుల బృందం హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర సీఈఓ, అధికారులతో మూడు రోజుల పాటు సమావేశమైంది. ఓటర్ల జాబితా మొదలు ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్, ఎలక్షన్ స్టాఫ్‌ను సమకూర్చుకోవడం, వారికి ట్రెయినింగ్ ఇవ్వడం, సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లను సీఈఓకు సహాయకంగా బదిలీ చేయడం.. ఇవన్నీ ఇటీవల చకచకా జరిగిపోయాయి. కేంద్ర పారామిలిటరీ బలగాల మోహరింపుపైనా చర్చ జరిగింది.
సెప్టెంబరు-అక్టోబరు మధ్యలో ఎన్నికలు?
కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన సయోధ్య ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ రద్దు కావడంతోనే కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగనున్నది. ఆగస్టులోనే షెడ్యూలును ప్రకటించి ఆ తర్వాత వారం రోజులకు నోటిఫికేషన్ వెలువడితే సెప్టెంబరు చివరి వారం లేదా అక్టోబరు సెకండ్ వీక్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తికావచ్చన్నది ఆ వర్గాల సమాచారం. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు కలిపి డిసెంబరులోనే ఎన్నికలు జరుగుతాయన్నది ఇంతకాలం ఉన్న అంచనా. కానీ తెలంగాణకు ముందుగానే ఎన్నికలు జరిగి బీఆర్ఎస్ గెలవడానికి వెసులుబాటు లభిస్తే దాని ప్రభావం మిగిలిన రాష్ట్రాలపై పడి కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చనే వ్యూహం కూడా ఒక భాగమని సమాచారం. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలను బీఆర్ఎస్ వర్గాలు కూడా కాదని చెప్పలేకపోతున్నాయి. బాస్ మదిలో ఏమున్నదో తమ స్థాయి వరకూ తెలిసే అవకాశం లేదని, ఏది ఎప్పుడైనా జరగొచ్చనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే సమయానికి కోడ్ పేరుతో ఎలాంటి ఆంక్షల్లేకుండా ‘ఆన్ గోయింగ్ స్కీమ్స్’ పేరుతో గృహలక్ష్మి (సొంత జాగలో ఇంటికి మూడు లక్షల సాయం), చేతివృత్తులకు చేయూత (లక్ష రూపాయల సాయం), రైతుబంధు, పోడు భూముల పంపిణీ, కల్యాణలక్ష్మి, రుణమాఫీ, దళితబంధు.. లాంటివి మరింత స్పీడ్ చేయనున్నది.
బీ-టీమ్ ఆరోపణలపై వ్యూహమేంటి?
అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తే బీజేపీ, బీఆర్ఎస్ భాయీ.. భాయీ అనే ఆరోపణలకు ఎలా కౌంటర్ ఇవ్వాలనేదానిపైనా మంతనాలు జరుగుతున్నాయి. వరంగల్ పర్యటన సందర్భంగా కేసీఆర్ పేరెత్తకుండా ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, కుటుంబ పాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయని, ఉచ్చులో చిక్కుకున్నట్లేనని పరోక్షంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను ప్రస్తావించారు. ఈ విమర్శలకు బీఆర్ఎస్ నేతలు కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఇవన్నీ బీఆర్ఎస్, బీజేపీలు ప్రత్యర్థి పార్టీలే అనే మెసేజ్ పంపడానికి దోహదపడ్డాయనేది ఆ రెండు పార్టీల భావన. కానీ తాజా పరిణామాలన్నీ ఈ రెండింటి మధ్య స్నేహమున్నదనే అభిప్రాయాన్ని బలపరిచేలా ఉన్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ‘బీ-టీమ్’ అనే అంశాన్ని కాంగ్రెస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను వన్‌సైడ్‌గా ఆకర్షించే వ్యూహం రూపొందించుకుంటుంది. దీనికి కౌంటర్‌గా బీఆర్ఎస్ కూడా తగిన కౌంటర్ స్ట్రాటెజీపై ఫోకస్ పెడుతుంది. ఇప్పటివరకూ బీ-టీమ్ ఆరోపణలపై పెదవి విప్పని సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో ఎలా విరుచుకుపడతారన్నది ఆసక్తికరంగా మారింది.