రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ వచ్చింది నిజమే.. CEO వికాస్ రాజ్ క్లారిటీ

by Disha Web Desk 2 |
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ వచ్చింది నిజమే.. CEO వికాస్ రాజ్ క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ (కరువు భత్యం) చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిక్వెస్టు వచ్చిందని, కానీ ఇప్పుడే హడావిడిగా ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. రైతుబంధు నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి రిక్వెస్టు వచ్చిందని, దానిపైన క్లారిటీ కోసం ప్రభుత్వానికి రాసిన లేఖకు ఇంకా రిప్లై రాలేదన్నారు. సంబంధిత అధికారుల నుంచి క్లారిటీ వస్తే అనుమతి ఇచ్చే విషయమై నిర్ణయం ఉంటుందని, ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే పెండింగ్‌లో ఉన్నదని వివరించారు.

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల ప్రచారం సందర్భంగా నగదు, బంగారం, లిక్కర్, గిప్టుల్లాంటివి భారీగా పట్టుబడ్డాయని, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి ను,చి 55 రోజుల్లో దాదాపు రూ. 669 కోట్ల మేర పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఈఓ వికాస్‌రాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకూ ఈ సోదాలు కంటిన్యూ అవుతాయన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా తనిఖీలు కొనసాగుతాయని, ఇందుకోసం ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో స్టాటిక్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు మూడు చొప్పున పనిచేస్తూ ఉంటాయన్నారు. ఎలక్షన్ కమిషన్ షెడ్యూలు విడుదల చేసింది మొదలు ఇప్పటివరకు 10,016 ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు తెలిపారు.

ప్రతీ ఎన్నికలప్పుడు పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తక్కువగా నమోదవుతూ ఉన్నదని, ఈసారి అవేర్‌నెస్ పెంచుతున్నట్లు తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలను వినియోగిస్తున్నామని, ఎన్నికల విధుల్లో సుమారు మూడు లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు వివరించారు. రాష్ట్ర పోలీసు శాఖ తరఫున 64 వేల మంది (హోంగార్డుల్ని కలుపుకుని), కేంద్రం నుంచి 375 కంపెనీల పారా మిలిటరీ బలగాలు ఉంటాయన్నారు. ఎన్నికల ప్రచారంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు, ఘర్షణలు జరిగినా ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశాలు లేవన్నారు. అందుకు అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఎన్నికల్లో 114 రిజిస్టర్డ్ (గుర్తింపు పొందిన పార్టీలతో కలిపి) పార్టీల తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, దేశ చరిత్రలోనే తొలిసారిగా హోం ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి పోలింగ్ కేంద్రం వరకూ రావడానికి వీలుపడని దివ్యాంగులు, వృద్ధులు తదితరులకు ఇంటి దగ్గరే ఓట్లు వేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. సూపర్ సీనియర్ సిటిజన్ (80 ఏళ్ల వయసు పైబడినవారు) ఇప్పటివరకూ 9,300 మంది హోం ఓటింగ్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో తేడాలు రాకుండా, పార్టీల మధ్య భేదాభిప్రాయాలకు ఆస్కారం లేకుండా ప్రతీ కేంద్రంలో ఒక అబ్జర్వర్ ఉంటారని, కౌంటింగ్ సమయంలోనూ ఒక్కో సెంటర్‌లో ఒకరు చొప్పున ఉంటారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి ఢిల్లీలోని కేంద్ర ఎలక్షన్ కమిషన్ తరపున ముగ్గురు ప్రత్యేక అబ్జర్వర్ (సీనియర్ అధికారులు) రాష్ట్రంలో ఉంటారని తెలిపారు.

రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్ల మంది ఉన్నారని, వారికి ఇండ్ల దగ్గరే స్లిప్పుల పంపిణీ జరుగుతున్నదని, ఇప్పటివరకు 2.81 కోట్ల మందికి అందేశామని, రెండు మూడు రోజుల్లో మిగిలినవారికి కూడా ఇస్తామన్నారు. మొత్తం 119 నియోజకవర్గాల పరిధిలో 35,655 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఈవీఎం (బ్యాలట్, కంట్రోల్ యూనిట్లు) సుమారు 59 వేలు అవసరమవుతున్నాయని, రిజర్వులో మరో 15% మేర సిద్ధంగా ఉంచుకున్నట్లు వివరించారు. ఎన్నికల ప్రచారం ఈ నెల 28 సాయంత్రం పూర్తవుతుందని, ఇప్పటివరకు పార్టీల సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌షో లాంటివాటికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 37 వేల పర్మిషన్లు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చేలా సీ-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినందున దాదాపు 6,600 కంప్లైంట్స్ వచ్చాయన్నారు.

Next Story

Most Viewed