బీఆర్ఎస్‌కు ఘోర పరాభవం.. ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన రాష్ట్ర అధ్యక్షుడు!

by GSrikanth |
బీఆర్ఎస్‌కు ఘోర పరాభవం.. ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన రాష్ట్ర అధ్యక్షుడు!
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘం ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ అనుబంధ సంఘం చిత్తుగా ఓటమి చెందింది. స్వయంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేయగా.. కార్మికులు చుక్కలు చూపించారు. బీజేపీ అనుబంధ కార్మిక సంఘానికి 396 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అనుబంధ సంస్థకు కేవలం 30 ఓట్లు మాత్రం రావడం గమనార్హం. దాదాపుగా 4500 మంది కార్మికులుండే ఈ పరిశ్రమలో 664 ఓటర్లుంటే మెజార్టీ ఓట్లు బీఎంఎస్‌కు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ఫలితాలు బీఆర్ఎస్‌కు పెద్ద షాక్ గానే చెప్పుకోవచ్చు. సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని సదాశివపేట మండలం అంకెనపల్లి ఎంఆర్ఎఫ్ కంపెనీలో శనివారం జరిగిన ఎన్నికలు జరిగాయి. ఫలితాలు బీఆర్ఎస్‌కు మింగుడుపడడం లేదని చెప్పుకోవచ్చు.

4500 మంది కార్మికులు, 664 ఓటర్లు..

సదాశివపేట మండలం అంకెనపల్లిలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో క్యాజువల్స్, పర్మినెంట్ కార్మికులు మొత్తం 4500 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో పర్మనెంట్‌కు సంబంధించి మొత్తం 664 వరకు ఓట్లు ఉన్నాయి. కాగా, సంగారెడ్డి జిల్లాలో ఎమ్మార్ఎఫ్ పేరు పొందిన కంపెనీగా చెప్పుకోవచ్చు. రెండేళ్లకు ఓ సారి పరిశ్రమలో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే శనివారం కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం కేఆర్ఎన్ నుంచి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ నుంచి ఎస్.మల్లేశం, సీఐటీయూ నుంచి బీరం మల్లేశంలు పోటీ చేశారు.

రాంబాబు యాదవ్‌కు 30 ఓట్లే..

అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేఎస్ఆర్ కార్మిక సంఘం నుంచి స్వయంగా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన ఈ కార్మిక సంఘం ఎన్నికల్లో రాంబాబుకు కేవలం 30 ఓట్లు మాత్రమే రావడంతో కేఎస్ఆర్ సంఘం కార్మికులు షాక్ తిన్నారు. ఈ స్థాయిలో ఘోర ఓటమి చెందుతామని వారు ముందుగా ఊహించి ఉండకపోవచ్చు. కాగా, సీఐటీయూ నుంచి పోటీ చేసిన బీరం మల్లేశంకు 160 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అనుబంధ బీఎంఎస్ నాయకుడు ఎస్.మల్లేశంకు అత్యధికంగా 396 ఓట్లు వచ్చాయి. అధికార కార్మిక సంఘం అభ్యర్థికి కేవలం 30 ఓట్లు రావడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం..

ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘం ఎన్నికల గెలుపోటముల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉంటుందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కేఎస్ఆర్ అభ్యర్థి చిత్తుగా ఓటమి చెందడాన్ని అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోవడం లేదు. సంగారెడ్డిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలో అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా పోటీ పడనున్నాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ కార్మిక సంఘం ఘోరంగా ఓడిపోవడం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంతో కొంత ప్రభావం చూపుతుందని కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీలో విస్త్రతంగా చర్చ జరుగుతున్నది.

ఆయన ఒంటెద్దు పోకడతోనే..

ఎంఆర్ఎఫ్‌లో పోటీచేసిన రాంబాబు యాదవ్ ఒట్టెద్దు పోకడలతోనే ఫలితాలు ఇలా వచ్చాయని కేఆర్ఎస్ కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. ఎవరిని సంప్రదించకుండానే పోటీ చేశారని చెబుతున్నారు. జిల్లా మంత్రి హరీష్ రావు, సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులను ఏ మాత్రం సంప్రదించకుండా ఆయనే పోటీ చేయడంతోనే ఓటమి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ అధిష్టం ఎలాంటి చర్యలు చేపట్టనున్నదో వేచి చూడాల్సి ఉన్నది.

Next Story