మునుగోడులో బీజేపీ సైలెంట్.. క్యాడర్‌లో కన్ఫ్యూజన్!

by Rajesh |
మునుగోడులో బీజేపీ సైలెంట్.. క్యాడర్‌లో కన్ఫ్యూజన్!
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారంతో కొన్ని రోజులుగా మునుగోడు నియోజకవర్గం క్యాడర్‌లో నైరాశ్యం నెలకొంది. తన సోదరుడు కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తారనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వెంట వచ్చిన వారంతా డైలమాలో పడ్డట్లు సమాచారం. మళ్లీ రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి వస్తున్నారని ప్రచారం జోరుగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మీడియా ముందుకొచ్చి తాను బీజేపీలోనే ఉన్నట్లు ప్రకటన చేశారు.

అనంతరం ఢిల్లీలో అమిత్ షా‌తో భేటీ అయిన రాజగోపాల్ రెడ్డి లిక్కర్స్ స్కాంలో కవితను అరెస్టు చేయకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యలు చేయడం పార్టీ క్యాడర్‌ను మరింత సందిగ్ధంలోకి నెట్టివేసింది. దీంతో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని నమ్ముకుని బీజేపీలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలంతా ఎటువైపు వెళ్లాలో నిర్ణయించుకోలేక సతమతమవుతున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ చివరికి పార్టీ మారుతూ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఆయన అనుచర వర్గం కూడా ఆలోచనలో పడ్డారు.

చేజారుతున్న క్యాడర్!

మునుగోడు నియోజకవర్గంలో అంతంతమాత్రంగానే ఉన్న బీజేపీ బలాన్ని రాజగోపాల్ రెడ్డి చేరికతో దాన్ని అమాంతం పెంచేశారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ కనుమరుగు అవుతుందని అందరూ భావించిన మునుగోడు ఉప ఎన్నికను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాజగోపాల్ రెడ్డి ని ఓడించింది. అయినా కూడా బీజేపీ బలం భారీగా పెరగడంతో ఆ పార్టీ క్యాడర్ ఇక నియోజకవర్గంలో తమకు తిరుగులేదని భావించింది. కానీ తాజాగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు పుకార్లతో ఆయన వెంట బీజేపీలో చేరిన నాయకులు డైలమాలో పడ్డారు. దీంతో ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచేందుకు కృషి చేస్తున్న పలువురు నాయకులు బీజేపీలో చేరిన కాంగ్రెస్ లీడర్లపై ఫోకస్ పెట్టారు. ఇటీవల కొందరు బీజేపీ నుండి కాంగ్రెస్‌లో కూడా చేరారు. దీంతో ఒక్కొక్కరుగా బిజెపి నుండి కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.

నియోజకవర్గంలో కనపడని కోమటిరెడ్డి!

పార్టీ మార్పు పుకార్ల అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించి క్యాడర్‌కు ఎలాంటి భరోసాను ఇవ్వడం లేదు. అంతేకాకుండా బీజేపీలో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఆయన పార్టీ అధినాయకత్వంపై అలకబూనినట్లు సమాచారం. వీటన్నిటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కచ్చితంగా పార్టీ మారవచ్చుననే ఆలోచనలో నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. ఒకవేళ బీజేపీలోనే కొనసాగాలనుకుంటున్న రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించి క్యాడర్‌కు ఎందుకు భరోసా నివ్వడం లేదు అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. ఇకనైనా వీటిపై స్పందించి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం‌లో పర్యటించి పార్టీ మార్పు అంశంపై క్యాడర్‌కు క్లారిటీ ఇచ్చి కన్ఫ్యూజన్ పోగొడతారో లేదో వేచి చూడాల్సిందే.

Next Story