తెలంగాణ సేఫ్‌గా లేదు.. టెర్రరిజం మూలాలు ఉన్నాయి: ప్రకాశ్

by Disha Web Desk 2 |
తెలంగాణ సేఫ్‌గా లేదు.. టెర్రరిజం మూలాలు ఉన్నాయి: ప్రకాశ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టెర్రరిజం మూలాలు ఉన్నాయని, మజ్లిస్ అండదండలతో టెర్రరిస్టులు ఎదుగుతున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడలో ఆయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చార్జ్ షీట్ కమిటీ చైర్మన్ మురళీధర్ రావుతో కలిసి సోమవారం చార్జ్ షీట్ రిలీజ్ చేశారు. అనంతరం ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శలు చేశారు. ఇలాంటి సర్కార్ దేశంలోనే లేదని ఘాటుగా స్పందించారు. సీఎం రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, అడ్డుకునేందుకు ఆటంకవాదులు ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీల వల్ల డ్రగ్స్, లిక్కర్, టెర్రరిజం విపరీతంగా పెరిగిపోతోందని ఆయన మండిపడ్డారు. టెర్రరిజం మూలాలు తెలంగాణలో ఉన్నాయని, రాష్ట్రం సేఫ్‌గా లేదని ఆయన పేర్కొన్నారు. వారంతా మజ్లీస్ అండదండలతో పెరుగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. స్లీపర్ సెల్స్ లాగా వారు పెరుగుతున్నారని పేర్కొన్నారు. గతంలో పీఎఫ్ఐ తో లింకులు ఇక్కడ బయటపడ్డాయని, పలువురిని ఎన్ఐఏ అరెస్ట్ కూడా చేసిందని జవదేకర్ గుర్తుచేశారు.

అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఒత్తిడితో పని చేస్తోందని విమర్శలు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల స్థితి చాలా మెరుగ్గా ఉండేదని ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థను రాజకీయం చేసేశారని, నచ్చిన వారికి అందలమెక్కిస్తున్నారని, ఏమైనా అంటే బదిలీలు చేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.



Next Story

Most Viewed