మొదటిసారి పేరు వెనుక ‘రెడ్డి’ అని పెట్టుకున్న షర్మిల.. అందుకు సంకేతమా?

by Dishafeatures2 |
మొదటిసారి పేరు వెనుక ‘రెడ్డి’ అని పెట్టుకున్న షర్మిల.. అందుకు సంకేతమా?
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై షర్మిల వైపు నుంచి గానీ, ఆమె పార్టీ వైపు నుంచి గానీ ఎలాంటి స్పందన రావడం లేదు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన గురించి షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అందులో షర్మిలా రెడ్డి రాజకీయ ఎదుగులదలను చూసి మంత్రి కేటీఆర్ కు భయం పట్టుకుందని అన్నారు. అయితే వైఎస్ఆర్టీపీని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను విమర్శిస్తూ వస్తోన్న షర్మిల.. ఏనాడు తన పేరు వెనుక ‘రెడ్డి’ని వాడలేదు. కానీ తాజాగా ఆమె తన పేరు వెనుక రెడ్డిని తగిలించడంతో ఆమె త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు ప్రధాన కారణం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోగానీ, ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాల్లో గానీ కాంగ్రెస్ అంటే రెడ్డి.. రెడ్డి అంటే కాంగ్రెస్ అనే ప్రచారం ఉంది.

ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి దాని స్థానంలో అధికారంలోకి వచ్చే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే రాష్ట్రాన్ని ఏలుతున్న వెలమ సామాజిక వర్గాన్ని ఢీకొట్టే సత్తా ఒక్క రెడ్డి వర్గానికే ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను ఢీకొట్టాలంటే రెడ్డిలంతా ఏకం కావాలని, కాంగ్రెస్ పార్టీలోకి రావాలని గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనమని వారు అంటున్నారు. ఇక కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు కూడా అనాదిగా రెడ్డి వర్గంపైనే ఆధారపడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తానూ రెడ్డి వర్గానికి చెందిన నాయకురాలినేనని, కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేయడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా తనకు పూర్తి హక్కు ఉందని, అందుకే షర్మిల తన పేరు వెనుక రెడ్డి అని పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



Next Story