దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా.. కేసీఆర్‌పై షర్మిల ఫైర్

by Disha Web Desk 19 |
దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా.. కేసీఆర్‌పై షర్మిల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయనే ఓట్ల కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల రాగం అందుకున్నాడని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఇన్నాళ్లు మొద్దు నిద్రపోయి ఎన్నికలు రాగానే కుంభకర్ణుడు నిద్రలేచినట్లుగా ఈ ప్రభుత్వం నిద్రలేచిందని ధ్వజమెత్తారు. పార్టీ గెలుపు కోసమే ఈ జిమ్మిక్కులంతా చేస్తున్నాడని.. దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా వంతు కూడా ఉండదని ధ్వజమెత్తారు.

13 లక్షల డబుల్ బెడ్ రూం దరఖాస్తులు వస్తే 30 వేల ఇళ్లు కూడా ఇవ్వలేని వాడు ఎన్నికలు వచ్చే సరికి నియోజకవర్గానికి 3 వేల మందికి మూడు లక్షల చొప్పున ఇస్తాడట అని ఎద్దేవా చేశారు. గతంలో 15 రోజుల్లోనే మూడు లక్షలు ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ముందు రూ.లక్ష, ఎన్నికల్లో గెలిస్తే రూ.లక్ష అంటూ తిరకాసు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇళ్ల పేరుతో 30 లక్షల కుటుంబాలను దగా చేసే పనిలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. గడిచిన 9 ఏళ్లలో ఏ ఒక్క ఎకర పోడు భూముకి పట్టా ఇవ్వని కేసీఆర్ సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని ముందటేసుకున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 13.18 లక్షల ఎకరాల పోడు భూములు ఉంటే 4.01లక్షల ఎకరాలకే పట్టాలు ఇచ్చి, చేతులు దులుపుకొని, ఓట్లు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇన్నాళ్లు బీసీలను నిండా ముంచి ఇప్పుడు బీసీ కుల వృత్తులకు లక్ష పేరిట ఓట్లను కొనే పథకాన్ని ప్రవేశపెట్టాడన్నారు. ఎన్నికలు ఉంటేనే దొర బయటకు వస్తాడని పథకాల పేరుతో వంచిస్తాడు. ప్రజలను బురిడీ కొట్టించి అర చేతిలో వైకుంఠం చూపిస్తాడని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల సంగతి ఏమైందని ప్రశ్నించారు.

Also Read...

‘మాకు నీతులు చెప్పకు’’.. సీఎంకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్

నీ అల్లుడు ఆంధ్ర కాదా.. రేవంత్ రెడ్డిపై షర్మిల ఫైర్


Next Story

Most Viewed