MP Arvindకు కేంద్రం హై సెక్యూరిటీ?

by Disha Web Desk |
MP Arvindకు కేంద్రం హై సెక్యూరిటీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ నేతలపై వరుస దాడులు, అడ్డగింతలపై హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై కూడా దాడులకు దిగడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడుత పాదయాత్రను శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే నేపథ్యంలో అడ్డుకోవడంపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. ధర్మపురి అర్వింద్ పై ఇంటిపై రెండుసార్లు, కాన్వాయ్ పై ఇటీవల ఒకసారి బీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆయనకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు కేంద్ర హోంశాఖకు అందాయి. కాగా ఆయనకు 'వై' కేటగిరీ సెక్యూరిటీని ఇవ్వడంపై కేంద్ర హోంశాఖ సమాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కు ప్రస్తుతం 2+2 సెక్యూరిటీ ఉంది. 'వై' కేటగిరీ సెక్యూరిటీ ఇస్తే.. ఉన్న నలుగురికి అదనంగా మరో నలుగురిని అందించాల్సి ఉంటుంది. ఇటీవల అర్వింద్ కు చెందిన జూబ్లీహిల్స్ ఇంటిపై టీఆర్ఎస్ నేతలు దాడులకు దిగి ఇంటితో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. గతంలో ఆర్మరూరులోని ఇంటిపై కూడా ఇలాంటి దాడులకు తెగబడ్డారు. ఆయన కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ అన్ని అంశాలపై సమగ్ర నివేదికను ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర హోంశాఖకు పంపించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న జాతీయ నాయకత్వానికి నాయకులను కాపాడుకోవడం ప్రతిష్టాత్మకంగా మారడంతో దాడులపై సీరియస్ గా ఉంది. వీటికి చెక్ పెట్టాలంటే అదనపు బలగాలను అందించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

పశ్చిమబెంగాల్ సహా బీజేపీ ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లో క్రీయాశీలకంగా పనిచేస్తున్న పలువురు ప్రజాప్రతినిధులకు కేంద్ర హోంశాఖ 'వై' కేటగిరి భద్రతను కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జాతీయ నాయకత్వం పూర్తి దృష్టి తెలంగాణపైనే ఉంది. అందుకే ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ప్రజల్లో చులకన భావం ఏర్పడే అవకాశాలుంటాయని, కష్టపడి పనిచేసే వారిని కాపాడుకోవాలని కేంద్ర హోంశాఖ యోచిస్తున్నట్లు టాక్. ఢిల్లీలో ఉన్న నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. మొన్న ప్రధాని మోడీ, నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యాడు. తెలంగాణలో తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతంతో పాటు చేరికల అంశంపై సైతం చర్చించినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ నాయకుల ప్రజావ్యతిరేక విధానాలను, వారి అనివీతి, అక్రమాలను అర్వింద్.. అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లాడు. అంతేకాకుండా తన ఇంటిపై జరిగిన దాడుల అంశాన్ని సైతం ఆయన ప్రస్తావించినట్లు వినికిడి. ఇంటెలిజెన్స్ నివేదికకు తోడు అర్వింద్ కూడా తనపై జరిగిన ఘటనను వివరించడంతో 'వై' కేటగిరీ భద్రతను అందించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్ కూడా కేంద్ర హోంశాఖ వద్ద పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇదిలా ఉండగా కేంద్రం అదనపు బలగాలను కేటాయించకుంటే తానే సొంతంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునే ఆలోచనలో అర్వింద్ ఉన్నట్లు వినికిడి.

Also Read..

ఉన్నది ఉన్నట్టు: టి- కాంగ్రెస్.. సీ'నియర్' వార్

Next Story

Most Viewed