సహకరిస్తారా? ఝలకిస్తారా?.. ఎంపీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు కొత్త టెన్షన్

by Disha Web Desk 13 |
సహకరిస్తారా? ఝలకిస్తారా?.. ఎంపీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు కొత్త టెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణలోని ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు విడతల వారీగా తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రత్యత్థులపై పై చేయి సాధించే ప్రయత్నం చేస్తుంటే మరో పక్క టికెట్ ఆశించి భంగపడిన వారి విషయంలో అన్ని పార్టీలకో టెన్షన్ మొదలైందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండగా బీఆర్ఎస్ లో ఈసారి తమ వారసులను లాంచ్ చేద్దామనుకున్న బడా నేతలకు నిరాశే మిగిలింది. దీంతో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఎన్నికల్లో పార్టీకి సహకరిస్తారా? లేక చివరి నిమిషంలో ఝలక్ ఇస్తారా? అనేది అన్ని పార్టీలను వేధిస్తోందట.

అన్ని పార్టీలది అదే తంతు:

తెలంగాణలో 12 స్థానాలపై గురిపెట్టిన బీజేపీ రెండు విడతల్లో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇందులో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయంబాపురావుతో సహా పలువురు ముఖ్యనేతలకు నిరాశే మిగిల్చింది. జితేందర్ రెడ్డి, జితేందర్, శాంత కుమార్, మురళీధర్ రావు, మల్క కొమురయ్య, చాడ సురేశ్ రెడ్డి, తూళ్ల వీరేందర్ గౌడ్, కూనం శ్రీశైలం గౌడ్, అంజిరెడ్డి తదితర నేతలు బీజేపీ టికెట్ ఆశించి నిరాశపడ్డారు. ఇక కాంగ్రెస్ లో నల్గొండ, జహీరాబాద్, మహబూబ్ నగర్, మహబూబాబాద్ నాలుగు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించగా వాటిల్లో టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతమ్మ, శివసేనా రెడ్డితో పాటు పలువురికి అధిష్టానం షాకిచ్చింది. ఇక బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఖమ్మం, మహబూబాబాద్,కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నిజామాబాద్, జహీరాబాద్, వరంగల్, చేవెళ్లకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే గులాబీ పార్టీలో సిట్టింగ్ ఎంపీలతో పాటు అంతకు ముందు రేస్ లో ఉన్నామని చెప్పుకున్న వారంతా పోటీకి దూరం జరగడం సంచలనంగా మారింది. నల్గొండ టికెట్ ఆశించిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి విషయంలో సొంత పార్టీ నేతలు పుల్లలు పెట్టారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఇక చేవెళ్ల టికెట్ ఆశిస్తున్న సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్ రెడ్డికి సైతం నిరాశే మిగిలింది. మిగతా చోట్ల సైతం అంతర్గత కలహాలతో నేతల మధ్య గ్రూప్ వార్ నడుస్తుండటం చర్చనీయాశం అవుతున్నది. మొత్తంగా అన్ని పార్టీలలో టికెట్ దక్కని వారు పార్టీ గెలుపు కోసం ఏ మేరకు పని చేస్తారనేది ఆసక్తిగా మారింది.

పార్టీలకు అసలైన అగ్నిపరీక్ష:

ఈసారి జరగబోయే ఎంపీ ఎన్నికలు అన్ని పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన వారికి ఎంపీ టికెట్ ఆశ చూపి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయితే ఎంపీ ఎన్నికల అనంతరం ఆ స్థాయిలో మరో నేరుగా పోటీ చేసే ఎన్నికలు లేకపోవడంతో అసంతృప్తులను, ఆశవాహులను బుజ్జగించడం పార్టీ అధిష్టానాలకు సవాలుతో కూడుకున్న పనిగా మారింది. కాంగ్రెస్, బీజేపీలు కేంద్రం, రాష్ట్రంలో అధికార పక్షం కావడంతో తమ నేతలకు ఎలాగైనా నచ్చజెప్పే అవకాశం ఉన్నా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటు నేతల వలసలతో రోజురోజుకు నిరుత్సాహవాతావరణంలో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానానికి ఈ వ్యవహారం కఠిన సవాలుగా మారనున్నదనే చర్చ జరుగుతోంది. మరి ఈ పరిస్థితితిని అన్ని పార్టీలు ఎలా హ్యాడిల్ చేస్తాయో చూడాలి మరి.

Next Story

Most Viewed