వస్తావా? రేటెంత? నైట్ టైంలో మహిళా జర్నలిస్టుకు వేధింపులు (వీడియో)

by Disha Web Desk 4 |
వస్తావా? రేటెంత? నైట్ టైంలో మహిళా జర్నలిస్టుకు వేధింపులు (వీడియో)
X

రాత్రి సమయంలో మహిళలు కనిపిస్తే పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న వారి పరిస్థితి మరీ దారుణం. వస్తావా? రేటెంత? అని వేధింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో జన సంచారం అధికంగా ఉండే కూకట్‌పల్లి ఏరియాలో ‘దిశ’ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో కఠోర వాస్తవాలు వెలుగుచూశాయి. ఓ మహిళా జర్నలిస్టు ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని రోడ్డు పక్కన నిల్చొని ఉండగా.. రెండు గంటల్లో.. 26 మంది పోకిరీలు.. వెకిలిగా ప్రవర్తించారు. రాయడానికి వీల్లేకుండా మాట్లాడుతూ పైత్యం ప్రదర్శించారు. ఈ సమయంలో అటు వైపు పోలీసులు, గస్తీ వాహనాలు రాలేదు. దీంతో నగరంలో మహిళలకు రక్షణ కరువైందని మరోసారి రుజువైంది.

దిశ తెలంగాణ క్రైం బ్యూరో : అర్ధరాత్రి మహిళ నిర్భయంగా రోడ్డు మీద నడిచినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టని మహాత్మాగాంధీ చెప్పారు. కానీ, దశాబ్దాలు గడుస్తున్నా.. కనీసం పగటి సమయంలో మహిళలు రోడ్లపైకి రావటానికే భయపడే పరిస్థితి నెలకొంది. ఇక చీకటి పడిన తర్వాత స్త్రీ బయటకు వస్తే పరిస్థితి మరీ దారుణం. వస్తావా? అని ఒకడు... రేటెంత అని ఇంకొకడు.. రాయటానికి కూడా వీల్లేని భాషతో కామాంధుల వేధింపులు ఎదరవుతున్నాయి.

మోస్ట్​ హ్యాప్పెనింగ్ ​సిటీ అంటూ గ్రేటర్​ హైదరాబాద్‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ తరచూ చెబుతుంటారు. శాంతిభద్రతలను కాపాడుతున్నందు వల్లనే అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని వివరిస్తుంటారు. ఇక, వంద శాతం విజబుల్​ పోలీసింగ్​ అమల్లో ఉందని, ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఏడు నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారని, స్త్రీల సేఫ్టీ కోసమే మహిళా భద్రత విభాగం, షీ టీమ్స్​పని చేస్తున్నాయని, అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుంటారు. ఇదంతా చూస్తే హైదరాబాద్‌లో మహిళలు సురక్షితంగా ఉన్నారని అనుకుంటారు ఎవరైనా. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ‘దిశ’ జరిపిన స్టింగ్ ​ఆపరేషన్‌లో ఇది బట్టబయలైంది.

2 గంటల్లో 26 మంది పోకిరీలు

కూకట్‌పల్లి రెమెడీ ఆస్పత్రి వద్ద ఓ మహిళా జర్నలిస్టు రోడ్డు పక్కన స్కార్ఫ్ కట్టుకుని నిలబడగా రెండు గంటల్లో 26 మంది ఆమె వద్దకు వచ్చారు. ఒకడు వస్తావా? అని అడిగితే ఇంకొకడు రేటెంత? అని ప్రశ్నించాడు. ఓ అమ్మాయి రోడ్డుపై నిలబడితే అంతేనా? అని సదరు జర్నలిస్టు ప్రశ్నిస్తే ఈ టైంలో నిలబడితే అదే అనుకుంటాం కదా అంటూ కొందరు పోకిరీలు సమాధానమిచ్చారు. మరొకడు దగ్గరకు వచ్చి ‘ఏదైనా ప్రాబ్లమా? ఈ సమయంలో ఇక్కడ నిలబడ్డారు. సమస్య ఉంటే చెప్పండి’ అంటూ మాట్లాడుతూనే వంకర చూపులు చూడటం గమనార్హం.

ఫ్రెండ్స్​కోసం వెయిట్ ​చేస్తున్నానని ఆ మహిళా జర్నలిస్టు చెప్పినా అతడు అక్కడే నిలబడి మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడగటం గమనార్హం. స్నేహితునితో కలిసి బైక్​పై వచ్చిన మరో యువకుడు.. ‘వస్తావా?’ అంటూ ఆమెను అడిగాడు. ఎక్కడికి అని ఆమె ప్రశ్నించగా.. హోటల్‌కు అని ఆ వ్యక్తి సమాధానమిచ్చారు. ఇలా రెండు గంటల్లో 26 మంది యువకులు ఆ మహిళా జర్నలిస్టు దగ్గరకు వచ్చి అభ్యంతరకరంగా మాట్లాడితే అక్కడే అటూ ఇటూ తిరుగుతున్న వారు ఆమెను పట్టి పట్టి చూశారు. ఈ రెండు గంటల్లో ఒక్క పెట్రోలింగ్​ వాహనం గానీ, గస్తీ పోలీసులు కానీ అక్కడ కనిపించలేదు.


Next Story

Most Viewed