రేవంత్ రెడ్డి హామీలు కాంగ్రెస్‌కు కలిసొస్తాయా?

by Rajesh |
రేవంత్ రెడ్డి హామీలు కాంగ్రెస్‌కు కలిసొస్తాయా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఓటర్లు ప్రభావితం కావాలని ఆయా పార్టీలు పలు హామీలిస్తాయి. అవి కలిసొచ్చే అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సైతం పలు కీలక హామీలను ఇచ్చారు. అందులో మొదటిది దళిత ముఖ్యమంతి కాగా మరో ప్రధానమైన హామీ ఇంటికో ఉద్యోగం.

పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్యారంగానికి పెద్దపీట వేస్తామని కేజీ టూ పీజీ అమలు చేస్తామని ప్రధానంగా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లారు. ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ ధ్వంసమైందని అన్ని రంగాల్లో వెనకబడిందని స్వయం పాలనలోనే మన అభివృద్ధి సాధ్యమని చెప్పి కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తదనంతరం సీఎం అయ్యారు. 2018లో సైతం పలు కీలక హామీలు ఇచ్చి రెండో టర్మ్‌లో అధికారంలోకి వచ్చారు.

ఈ రెండు టర్మ్ ల్లో కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కారణమయ్యాయి. అయితే ఇదే అంశంపై ఫోకస్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌కు కౌంటర్‌గా కాంగ్రెస్‌ను తెలంగాణ‌లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పలు కీలక హామీలను జోడో యాత్రలో గుప్పిస్తున్నారు. ప్రజల సమ్యలను ఓపికగా వింటున్న రేవంత్ రెడ్డి అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు.

రేవంత్ రెడ్డి కీలక హామీలు..

ప్రస్తుతం రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో సైతం పలు కీలక హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఆడబిడ్డలకు రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని పేర్కొంటున్నారు. ఇందిరమ్మ పథకంలో ఇళ్లు కట్టుకునే వారికి నేరుగా రూ.5లక్షలు ఇస్తామని హామీ ఇస్తున్నారు.

ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు పెంచుతామంటున్నారు. బోధనా రుసుము బకాయిలు చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులను టార్గెట్ చేసి హామీ ఇస్తున్నారు. భూసమస్యలకు కారణమవుతున్న ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామంటున్నారు. కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన పథకాల గురించి బహిరంగ సభల్లో రేవంత్ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

కాంగ్రెస్ చేసిన అభివృద్ధే టార్గెట్‌గా స్పీచ్‌లు..

ఇందిరమ్మ ఇళ్లు, ఫీజురీఎంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను కాంగ్రెస్ తీసుకువచ్చిందని రేవంత్ ప్రధానంగా తన స్పీచ్‌ల్లో చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కలిసొస్తున్న అంశాలను సైతం ప్రస్తావిస్తూ రేవంత్ హామీల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని సైతం రేవంత్ ప్రస్తావిస్తున్నారు.

కాగా కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో సత్తా చాటాలంటే మాత్రం ఈ హామీలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సి ఉంది. ఐక్యతారాగం వినిపిస్తేనే కాంగ్రెస్‌కు కలిసొస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. సంస్థాగతంగా బీజేపీ కంటే తెలంగాణలోని అన్ని నియోజవర్గాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నా.. పొలిటికల్‌గా మైలేజ్ ఇచ్చే అనేక అంశాలను లైట్ తీసుకుంటుందనే వాదన ఉంది. దాన్ని అధిగమిస్తే మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి హాథ్ సే హాథ్ జోడో‌లో రేవంత్ రెడ్డి ఇస్తున్న హామీలు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు కలిసివస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో ఈ హామీల ప్రభావం ఏ మేరకు ఉండనుందో చూడాలి.

Next Story

Most Viewed