కేసీఆర్‌కు షాకిచ్చేలా మిత్ర పార్టీ అధినేత వ్యాఖ్యలు!

by Disha Web Desk |
కేసీఆర్‌కు షాకిచ్చేలా మిత్ర పార్టీ అధినేత వ్యాఖ్యలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు వేగంగా మారుతున్నాయి. మోడీ సర్కార్‌ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ వరుస ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు వచ్చింది. ఈ క్రమంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను ప్రదర్శించేందుకు భారత్ జోడో యాత్ర ముగింపు ర్యాలీ కార్యక్రమాన్ని ఓ ఊతంగా వాడుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు శ్రీనగర్‌లో జనవరి 30న జరగనున్న భారత్ జోడో యాత్ర ముగింపు ర్యాలీలో హాజరుకావాలని 23 పార్టీల అధినేతలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖలు రాశారు. ఈ విషయంలో తనకు అందిన ఆహ్వాన లేఖపై మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవేగౌడ రియాక్ట్ అయ్యారు.

ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గేకు రిప్లే లేఖ రాస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లో జరగబోయే కార్యక్రమానికి తాను వ్యక్తిగతంగా హాజరుకాలేక పోతున్నాను. కానీ రాహుల్ గాంధీకి నా శుభాకాంక్షలు అని లేఖలో పేర్కొన్నారు. ద్వేషం, హింసకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడుతున్నాడని, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్లు నడిచి ప్రజల మధ్య సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేశాడు. ఆయనకు నా అభినందనలు తెలియజేయండి అంటూ మంగళవారం దేవేగౌడ ఏఐసీసీ ప్రెసిడెంట్‌కు లేఖను పంపించారు.

కేసీఆర్ మిత్రుడు రాహుల్‌ను ప్రశంసించడంపై చర్చ

దేవేగౌడ రాహుల్ గాంధీని ప్రైజ్ చేయడంపై రాజకీయంగా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా కేసీఆర్‌తో జేడీఎస్ నేతలు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన అన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఆయన కేసీఆర్ వెంట ఉన్నారు. అయితే అనూహ్యంగా మొన్నటి ఖమ్మంలో బీఆర్ఎస్ సభలో మాత్రం ఆయన కనిపించలేదు. దీంతో కుమారస్వామి ఆబ్సెంట్ పై తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శలు చేశాయి. కుమారస్వామి సెంట్రిక్ గా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ కుట్రలు గ్రహించే కుమార స్వామి ఖమ్మం సభకు రాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

అయితే కుమార స్వామి రాకపోవడానికి ఇతర పనులే కారణం అని చెప్పినా త్వరలో జరగబోయే సచివాలయం ప్రారంభోత్సవానికి సైతం ఆయన రాకపై సస్పెన్స్ కొనసాగుతోంది. సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిరాహ్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, బిహార్ సీఎం నితీష్ కుమార్ తరపున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ తో పాటు డా.బి.ఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితరులు పాల్గొంటారని మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్ తెలిపారు. రాబోతున్న అథితుల జాబితాలో కుమార స్వామి గానీ, జేడీఎస్ నేతల పేర్లు కాని లేవు. దీంతో ఖమ్మం సభకు రాలేకపోయిన జేడీఎస్ నేతలు కనీసం సచివాలయం ప్రారంభోత్సవానికైనా వస్తారా లేదా అనేది సందేహంగా మారింది. ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాలు చేయాలని చూస్తున్న కేసీఆర్ ఓ వైపు బీజేపీ, కాంగ్రెస్ ను విమర్శిస్తుంటే మరో వైపు కేసీఆర్ మిత్ర పార్టీగా ఉన్న జేడీఎస్ అధినేత మాత్రం బీజేపీపై రాహుల్ గాంధీ అద్భుతంగా పోరాటం చేస్తున్నారని ప్రచారం చేయడం రాజకీయ వర్గాల్లో మరింత హాట్ టాపిక్ అవుతోంది.


Next Story

Most Viewed