బీఆర్ఎస్ ప్రకటన టైమ్ లో లెఫ్ట్ పార్టీలెక్కడ?

by Disha Web Desk |
బీఆర్ఎస్ ప్రకటన టైమ్ లో లెఫ్ట్ పార్టీలెక్కడ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై ఉత్కంఠకు తెరదించారు. టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా రూపాంతరం చెందుతుందని అధికారికంగా ప్రకటించారు. బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరును లాంఛనంగా ప్రకటించారు. పార్టీకి కొత్త పేరు ప్రకటన కోసం నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మిత్రులు కనిపించకపోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన కమ్యూనిస్టు పార్టీల నేతలు ఎవరూ ఈ మీటింగ్ లో కనిపించలేదు. కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర మరి కొన్ని రాష్ట్రాల నుంచి ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరయ్యారు. వారందరిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించి ఆథిత్యం ఇచ్చారు. కానీ కష్టకాలంలో కేసీఆర్ కు మద్దతుగా నిలిచిన ఎర్రజెండా నేతలు ఎవరూ ఈ సమావేశంలో కనిపించకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లను ఈ సందర్భంగా ఎత్తి చూపుతున్నారు. తోక పార్టీలంటూ కమ్యూనిస్టులను ఉద్దేశించి గతంలో కేసీఆర్ పలుమార్లు విమర్శలు చేసిన విషయాన్ని ఇప్పుడు విమర్శకులు ప్రస్తావిస్తున్నారు. గతంలో జాతీయ రాజకీయాల విషయంలో సీపీఐ, సీపీఎం పార్టీల జాతీయ అగ్రనాయకత్వంతో ప్రగతిభవన్ లో కేసీఆర్ భేటీ అయ్యారు. సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, సీపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిల్లై, బాల కృష్ణన్, ఎం ఎ బేబీ తదితరులు కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరందరిని ప్రగతి భవన్ లోకి ఆహ్వానించిన కేసీఆర్ వారితో జాతీయ రాజకీయాలు, తదితర అంశాలపై చర్చించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో జాతీయ స్థాయిలో బీజేపీని సాకుగా చూపి కమ్యూనిస్టు పార్టీలకు దగ్గరయ్యారు. బీజేపీని ఓడించేందుకే తాము టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించామని తెలంగాణకు చెందిన కమ్యూనిస్టులు సైతం ప్రకటనలు చేశారు. మరి బీజేపీని ఎదుర్కొనేందుకు జాతీయ పార్టీ అనౌన్స్ చేస్తుంటే ఆ సమావేశంలో ఇతర పార్టీ నేతలను ఆహ్వానించిన కేసీఆర్.. మద్దతిచ్చిన కమ్యూనిస్టులను ఆహ్వానించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇంతకీ సీపీఐ, సీపీఎం నేతేలను కేసీఆర్ ఆహ్వానించారా లేదా అనేది పొలిటికల్ సర్కిల్స్ లో దుమారం రేపుతున్నది. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టుల ఓట్లు కీలకం అనే అంచనాలు ఉన్న నేపథ్యంలో వారికి బీఆర్ఎస్ అనౌన్స్ మెంట్ సమావేశంలో ఎలాంటి ప్రాధాన్యత లభించకపోవడం లెఫ్ట్ పార్టీ శ్రేణలు ఎలా అర్థం చేసుకుంటాయో అనే చర్చ మొదలైంది.


Next Story

Most Viewed