విజయ సంకల్పం సరే.. బీజేపీ సభలకు జనం ఎక్కడ..?

by Rajesh |
విజయ సంకల్పం సరే.. బీజేపీ సభలకు జనం ఎక్కడ..?
X

దిశ, నల్లగొండ బ్యూరో: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బిజెపి అధికారంలోకి తీసుకురావాలన్నది ఆ పార్టీ జాతీయ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బిజెపి విజయసంకల్పయాత్ర కార్యక్రమం చేపట్టింది. కానీ క్షేత్రస్థాయిలో బిజెపి నాయకత్వం అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.

భువనగిరిలో విజయ సంకల్ప యాత్ర..

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే ప్రభుత్వం మూడో సారి చేయాలని లక్ష్యంతో పార్టీ నాయకత్వం, ప్రభుత్వం భావిస్తుంది. దానికోసం తెలంగాణలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పదికి పైగా ఎంపి స్థానాలను గెలవాలని భావిస్తుంది. ఈ క్రమంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంతో పాటు రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ప్రజలకు వివరిస్తూ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వివరించేందుకు విజయ సంకల్ప యాత్ర పేరుతో పరోక్షంగా ఎన్నికల ప్రచారాన్ని బిజెపి చేపట్టింది.

ఇందులో భాగంగానే ఈనెల 21న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో యాత్ర ప్రారంభమైంది.. రాత్రి యాదగిరిగుట్టలో బస చేసి 22న ఆలేరు మోటకొండూరు ఆత్మకూరు మోత్కూరు తిరుమలగిరి తుంగతుర్తి మీదుగా రాత్రి శాలిగౌరారంలో రాత్రి బస చేశారు.

సభలు సరే.. జనం ఏరీ..

విజయ యాత్ర సంకల్ప సభలకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలని జాతీయ నాయకత్వం ఆయా జిల్లా పార్టీ నాయకత్వాలకు ఆదేశాలు జారీ చేసింది కానీ ఆదేశాలు అమలు చేయడంలో జిల్లా నేతలు పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 500 బైక్‌లతో యాత్ర స్వాగతం పలకాలి. పాటుగా అక్కడ నిర్వహించే బహిరంగ సభకు దాదాపు పదివేల మంది జన సమీకరణ ఉండాలని అధిష్టానం. కానీ భువనగిరి అసెంబ్లీ కేంద్రంలో స్వాగతం పలికేందుకు కనీసం 50 బైకులు లేవు.. జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో కూడా 2 వేల మంది జనం లేరు.

కాస్తో కూస్తో బిజెపికి పట్టున్న భువనగిరి అసెంబ్లీ కేంద్రంలోని పరిస్థితి ఇలా ఉంటే ఆ తర్వాత రోజు జరిగిన ఆత్మకూరు మోత్కూర్ తిరుమలగిరి తుంగతుర్తి శాలిగౌరారం మండల కేంద్రాల్లో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. కానీ ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ఇన్చార్జి పాడాల శ్రీనివాస్ నాయకత్వంలో జరిగిన సభ కొంత మెరుగ్గా జరిగినట్లు తెలుస్తోంది.

నేతల మధ్య కోల్డ్ వార్..

యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో జరిగిన విజయ సంకల్ప యాత్ర సభకు ఆ పార్టీ జిల్లా మాజీ అద్యక్షుడు పివి శ్యాంసుందర్రావు హాజరు కాలేదు. గత 20 రోజుల క్రితం వరకు అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు సభకు రాకపోవడంతో పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత కొమ్ములాట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు స్వయంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్ చేసి ఆయనతో మాట్లాడారు.

సంకల్ప యాత్రకు సంబంధించిన సమాచారం తనకు లేనప్పుడు ఎలా వస్తానని ఆయన మాట్లాడినట్టు తెలిసింది. చాలా మంది నాయకులకు పార్టీ కార్యక్రమాల సమాచారం లేని కారణంగా హాజరు కాలేకపోయారని తెలిసింది దానికి తోడు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆ జిల్లాలో కనిపించని అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని తెలుస్తుంది. ఇదే పరిస్థితి ఆ జిల్లా మొత్తం కూడా ఉన్నట్లు పార్టీ సీనియర్ నేతలే మాట్లాడుకుంటున్నారు.

గురువారం నుంచి నకిరేకల్ నియోజకవర్గంలో జరిగే సంకల్పయాత్ర కావడంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ నియోజకవర్గంలో ఇప్పటికే నాయకత్వం మూడు గుంపులు ఆరు కొట్లాటలుగా విడిపోయి ఉన్నారని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. దానికి తోడు పార్టీ సీనియర్ నాయకత్వం కూడా కొంత ఆలక భూనినట్లు తెలుస్తుంది. సభకు జనాన్ని తరలించేందుకు ఏ నాయకుడు కూడా ముందడుగు వేయడం లేదని సమాచారం.



Next Story

Most Viewed