- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘హిట్లర్’ స్ఫూర్తి ఏంటి? సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ‘హైడ్రా’ గురించి మాట్లాడుతున్న క్రమంలో, జర్మనీ నియంత ‘హిట్లర్’ తో పోల్చుతూ మాట్లాడడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం చేపడుతున్న ‘హైడ్రా’ గురించి మాట్లాడుతున్న క్రమంలో, జర్మనీ నియంత ‘హిట్లర్’ తో పోల్చుతూ మాట్లాడడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా వ్యతిరేకి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసిన నియంతను స్ఫూర్తిగా తీసుకుని వ్యవహరిస్తానంటే.. గతంలో హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరించారు. హిట్లర్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత హీనమైన, దుర్మార్గపు చరిత్ర కలిగిన వ్యక్తి.. లక్షలాది మందిని మానవత్వం లేకుండా, క్రూర మృగం కంటే దారుణంగా హత్యాకాండకు గురిచేసిన నరహంతకుడని పేర్కొన్నారు. సుమారు 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలను బలిగొని, కోట్లాది మంది జీవితాల్లో తీవ్ర విధ్వంసాన్ని నింపి రెండో ప్రపంచ యుద్ధానికి మూల కారకుడు హిట్లరేనని, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను, ఇక్కడి హైడ్రా కూల్చివేతలను పోల్చి మాట్లాడటం సీఎంకు అంతర్జాతీయ విషయాలపై అవగాహన లోపాన్ని సూచిస్తోందన్నారు.
ప్రజల హక్కులను కాలరాస్తూ, అహంకారంతో వ్యవహరించిన ప్రభుత్వాలకు, వ్యక్తులకు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో ప్రపంచ చరిత్రతో పాటు, మన దేశ, రాష్ట్ర చరిత్రలు కూడా నిరూపించాయని గుర్తుచేశారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి, హిట్లర్ పేరు ప్రస్తావిస్తూ, హైడ్రా పేరునే హిట్లర్ స్ఫూర్తితో తీసుకున్నానని అనడం అత్యంత విచారకరమన్నారు. సీఎం వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని, తన బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు గాను రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.






