BRSకు చిక్కులు.. పొరుగు రాష్ట్రాల్లో కేసీఆర్ వ్యూహమేంటి?

by Disha Web |
BRSకు చిక్కులు.. పొరుగు రాష్ట్రాల్లో కేసీఆర్ వ్యూహమేంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్​ జాతీయ పార్టీకి పక్క రాష్ట్రాలే ప్రమాదకరమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన అంటూ ఆవిర్భవించిన టీఆర్​ఎస్​.. ఇప్పుడు జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది. కేవలం తెలంగాణ అస్థిత్వం, బంగారు తెలంగాణ అంటూ పాలన సాగించిన సీఎం కేసీఆర్​ తాజాగా దేశంలో యాంటీ బీజేపీ అంటూ జాతీయ రాగమందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేండ్లు సర్కారును నడిపిన కేసీఆర్​ పక్క రాష్ట్రాలతో ఏదో రూపంలో కయ్యం కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ, ఇవాళ జాతీయ రాజకీయాల్లోకి టీఆర్​ఎస్​ ను తీసుకెళ్తున్నారు. పేరు మార్చి యాంటీ బీజేపీ ప్రంట్​ అంటూ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఆనుకుని ఉన్న రాష్ట్రాల నుంచి ఎలాంటి మద్దతు వస్తుందనేది సందేహంగా మారింది.

జల జగడాలు

ఎగువన కర్ణాటక, ఇటు మహారాష్ట్రతో గోదావరి, కృష్ణా జలాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరంపై మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్తూనే ఉంది. సరిహద్దులో అంతరాష్ట్ర జల వివాదాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు చెందిన వారు నిరాశ్రయులయ్యారు. ఇంకా పరిహారం వివాదం సాగుతోంది. ఇటు కర్ణాటక కూడా తెలంగాణకు వచ్చే నీటిని అడ్డుకుంటూనే ఉంది. ఓవైపు కృష్ణా జలాలు, మరోవైపు తుంగభద్ర నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేస్తూనే ఉంది. అంతేకాకుండా భీమా నదిపై కూడా కొత్త బ్యారేజీని నిర్మిస్తోంది. జొలదడిగి–గూడూరు బ్యారేజీ దిగువన మరో ప్రాజెక్టు చేపట్టింది. 44 భారీ గేట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఇబ్బందే. మరోవైపు ఆల్మట్టి ప్రాజెక్టు వ్యవహారం రాష్ట్రాల మధ్య సాగుతూనే ఉంది. 519 అడుగుల ఎత్తులో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 524 అడుగులకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్​ కు కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది. ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు. ఐదు మీటర్లు పెంచడం ద్వారా మరో 130 టీఎంసీలు అదనంగా వాడుకునే సౌకర్యం కర్ణాటకకు లభిస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు కల్పిస్తోంది. దీనిపై తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ వివాదం సాగుతూనే ఉంది. అటు ఆర్డీఎస్​ నీళ్లపైనా అదే వైఖరి కొనసాగుతోంది.

ఏపీతో షరా మామూలే

ఇక, ఏపీతో 8 ఏండ్ల నుంచి కొట్లాట ముగియడం లేదు. ఇద్దరు సీఎంల మధ్య సామరస్య ఒప్పందాలున్నా.. ఒక దశలో రాజకీయపరమైన విభేదాలు వస్తున్నాయి. అంతేకాకుండా విభజన సమస్యలు మామూలే. దీనికి తోడు విద్యుత్​ లొల్లి. అంతేకాకుండా నీళ్ల కొట్లాట కొనసాగుతోంది. గోదావరి, కృష్ణా నదులకు దిగువన ఉన్నా.. నీళ్లను తీసుకెళ్లడంలో ఏపీ స్పీడ్​ ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఇది తీవ్ర విమర్శలకు సైతం దారి తీస్తోంది.

మాటలతోనే చేటు

మరోవైపు సీఎం కేసీఆర్​ నుంచి మొదలుకుని.. మంత్రుల వరకు పక్క రాష్ట్రాలపై ఏదో ఒక విధంగా నోరు పారేసుకుంటున్నారు. ఏపీలో రోడ్లు బాగా లేవని, కర్ణాటకలో పాలన లేదని, ఇంకా ఏదో రాష్ట్రంలో అవినీతి ఉందంటూ విమర్శలు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఫోకస్​ చేసేందుకు ఇతర రాష్ట్రాలను తక్కువగా చూపించాయి. అక్కడి సీఎంలను కూడా కించపర్చే వ్యాఖ్యలను గతంలో చేశారు.

ఇప్పుడేంది పరిస్థితి

తాజాగా కేసీఆర్​ జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అసలు పక్క రాష్ట్రాల నుంచి ఎలాంటి సాయం ఉంటుందనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క స్టేట్​ తోనూ సక్రమ సంబంధాలు లేవు. కయ్యాలు, కొట్లాటలు, విమర్శలతోనే కాలం వెళ్లదీశారు. కేవలం తెలంగాణ స్టేట్​ లోనే అభివృద్ధి ఉందంటూ పక్క రాష్ట్రాలను కించపర్చే విధంగానే వ్యవహరించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్​ జాతీయ రాజకీయాల్లో భాగంగా ఏపీకి మినహా.. పక్క రాష్ట్రాలన్నీ చుట్టి వచ్చారు. కానీ, అక్కడ నుంచి తక్కువ ప్రయార్టీ వచ్చింది. కర్ణాటక నుంచి కుమారస్వామి, తమిళనాడు నుంచి తిరుమాళవన్​ హాజరువుతున్నట్లు టీఆర్​ఎస్​ ప్రకటించింది. అంతేకానీ, అటు బీహార్​, పశ్చిమబెంగాల్​, చతీస్​గడ్​, ఒడిశా, పంజాబ్​, ఢిల్లీ, జార్ఖండ్​ వంటి ప్రాంతాల నుంచి ఎవరూ రావడం లేదు.

అల్రెడీ ఉన్నారు కదా..!!

దేశంలో యాంటీ బీజేపీ ఫ్రంట్​ నినాదంతో కేసీఆర్​ ఆయా రాష్ట్రాలకు వెళ్లారు. ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు. కానీ, ఎక్కడి నుంచి కూడా సరైన రిప్లే రాలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు ఏదో ఒక కూటమిలో కొనసాగుతూనే ఉన్నారు. ఉంటే ఎన్డీఏ.. లేదంటూ యూపీఏలో ఉన్నారు. కాంగ్రెస్​ లేని కూటమి సాధ్యం కాదంటూ శరద్​ పవార్​, హేమంత్​ సోరేన్ వంటి నేతలతో పాటుగా బీహార్​ సీఎం నితీష్​ కూడా ప్రకటించారు. కానీ, కాంగ్రెస్​ ను వ్యూహాత్మకంగా ఖతం చేసిన కేసీఆర్​ ను.. ఆ పార్టీ నేతలు దగ్గరకు తీసే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో కేసీఆర్​ వెళ్లి సాయం కోరిన రాష్ట్రాల నుంచి ఆశించిన విధంగా మద్దతు రాలేదు.

రైతులతోనే సరిపుచ్చుతారా..?

సీఎం కేసీఆర్​ కు దేశవ్యాప్తంగా కొన్ని రైతు సంఘాలు మాత్రం మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్​ రైతు ఉద్యమ నేత రాకేష్​ టికాయత్​ ఆధ్వర్యంలోని రైతు సంఘాల బృందం ఇటీవల కేసీఆర్​ ను కలిసిన విషయం తెలిసిందే. కానీ, రైతు ఉద్యమ నేతలతో జాతీయ రాజకీయాలు ఎలా నడుపుతారనేది పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్న అభిప్రాయం. అంతేకాకుండా జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల నుంచి నేతలను ఆహ్వానించినా.. వస్తామని చెప్పి రావడం లేదు. కేవలం కర్ణాటక, తమిళనాడు నుంచి మాత్రమే ఇద్దరు నేతలు వచ్చారు.

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed