పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు ఇచ్చి తీరుతాం: కేటీఆర్

by Kalyani |
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు ఇచ్చి తీరుతాం: కేటీఆర్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎవరు అడ్డుపడినా నీళ్లు ఇచ్చి తీరుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మంగళవారం మంత్రి కేటీఆర్ హెలికాప్టర్ లో ఉదయం 11.08 గంటలకు చేరుకొని జిల్లా కేంద్రంలో పర్యటించి నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనతో పాటు రూ. 184.42 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, మంత్రులు మహమ్మద్ అలీ, నిరంజన్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 11.09గంటలకు , చివరగా సీనియర్ సిటిజన్స్ పార్కును మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మినీ స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని 2 లక్షల 20 వేల ఉద్యోగాలను తెలంగాణలో సాధించుకున్నామన్నారు. రాష్ట్ర విభజన అయి ఎనమిదిన్నర ఏళ్ళు అయినా కూడా కృష్ణనది నీటిలో తెలంగాణ వాటాను తేల్చకుండా, ట్రిబ్యునల్ కు ఉత్తరం రాసే టైం కూడా లేనట్లుగా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్న మాట వాస్తవం కాదా అన్న విషయం ప్రజలు గ్రహించాలన్నారు. ఈ దేశంలో అసమర్థ పనికిమాలిన ప్రధాని ఎవరైనా ఉన్నారా అంటే అది మోడీనే అని తీవ్రస్థాయిలో విమర్శించారు. హిందూ- ముస్లిం, దేశం కోసం- ధర్మం కోసం అనే సొల్లు పురాణం తప్ప తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నిస్తే బీజేపీ నాయకుల నోట్లో ఉలుకు పలుకు లేదన్నారు. ఏం మొహం పెట్టుకుని మోడీ పాలమూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రశ్నించారు.

మంత్రులు కూడా ఈర్ష పడే విధంగా నారాయణపేట జిల్లాకు నిధుల వరదతో అభివృద్ధి చెందుతుందని సభా వేదికగా తెలియజేస్తూ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అభివృద్ధి పనితీరును ప్రశంసించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు నిధుల వరదతో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క తెలంగాణ రాష్ట్రం లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ నాయకుల మాటలు సొల్లు పురాణం తప్పిస్తే చేసినా అభివృద్ధి ఏమిటో చెప్పడానికి ఏమీ లేదన్నారు. కులాలు, మతాల మధ్య గొడవలు సృష్టించడమే బీజేపీ నాయకుల పని అని రాబోయే ఎన్నికల్లో నారాయణపేట ఎమ్మెల్యేను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు.

కంటి పరీక్షలు చేసుకొని అభివృద్ధిని చూడండి : ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి

అసలు అభివృద్ధి అంటే ఏంటో ప్రతిపక్ష పార్టీలకు తెలుసా అని? కంటి వెలుగులో కంటి పరీక్షలు చేసుకుని వచ్చి తాను చేసిన అభివృద్ధి అంటే ఏమిటో చూడాలని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ప్రతిపక్షాలకు హితవు పలికారు. సిరిసిల్ల జిల్లాలో కూడా లేని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు సమీకృత ప్రభుత్వ కార్యాలయాన్ని నారాయణపేట జిల్లాకు ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో తెలియని బీజేపీ నాయకులు కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు చేసుకుని అభివృద్ధిని స్వయంగా చూడాలని హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తేనే వ్యాపారస్తులు భయపడుతున్నారన్నారు.

బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం స్థలాన్ని ఆర్టీసీ నుంచి బలవంతంగా లాక్కున్నామని కొందరు విష ప్రచారం చేస్తున్నారని మరికల్ వద్ద ఆర్టీసీకి తిరిగి స్థలాన్ని కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను నిజాలు మాట్లాడితే లాగులు తడుస్తాయని ఘాటుగా హెచ్చరించారు. ఎండని సైతం లెక్కచేయకుండా వేలాదిగా ఇంతమంది జనంతో ఎప్పుడైనా నారాయణపేట చరిత్రలో ఇంత పెద్ద బహిరంగ సభ జరిగిందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ వనజ, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ మాయాంక్ మిత్తల్, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం, జైపాల్ యాదవ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ కే. దామోదర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, కార్పొరేషన్ల చైర్మన్లు సాయి చంద్, ఇంతియాజ్ ఇసాక్, వాల్యా నాయక్, ఆంజనేయ గౌడ్, పేట, కోస్గి మున్సిపల్ చైర్ పర్సన్లు గందే అనసూయ, శిరీష, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేపూరి రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ హరి నారాయణ భట్టడ్, విజయసాగర్ కృష్ణా కోర్వార్, శ్రీపాద్ తదితరులు పాల్గొన్నారు.
Next Story