'కంటి వెలుగు స్తంభింప‌జేస్తాం..'

by Disha Web Desk 4 |
కంటి వెలుగు స్తంభింప‌జేస్తాం..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : దీర్ఘకాలంగా తాము సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైద్యారోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమను ఉద్యోగులుగా గుర్తించాలని, తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే కంటి వెలుగు కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని పేర్కొన్నారు. పనికి తగ్గ పారితోషం పేరిట ఆశా కార్యకర్తలకు వెట్టిచాకిరి తప్పడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కంటి వెలుగు కార్యక్రమ బాధ్యతలను తమకే అప్పగించాలన్నారు.

ప్రతిసారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడమే మినహా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తాము అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని సంఘం ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అవసరమైతే సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాల సమ్మెకు వెళ్లేందుకు వెనకాడబోమన్నారు.

ఏఎన్ఎంలకు అదనపు భారం..

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమయంలో హఠాత్తుగా ఆశ కార్యకర్తలు గురువారం సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆరోగ్యశాఖ యంత్రాంగం ఆందోళనకు గురై అప్రమత్తమయింది. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలను కంటి వెలుగు కార్యక్రమాలకు డిప్యూటేషన్ చేశారు. ఇది తమకు అదనపు భారం అవుతుందని ఏఎన్ఎంలు ఆందోళన చెందుతున్నారు.


Next Story

Most Viewed