పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేయలేనిది మేం చేశాం ; మంత్రి దామోదర్‌

by Kalyani |
పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేయలేనిది మేం చేశాం ; మంత్రి దామోదర్‌
X

దిశ, అందోల్‌/రాయికొడ్‌: గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్కరేషన్‌ కార్డును కూడా ఇవ్వలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. సోమవారం రాయికోడ్‌లోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకేళ్తుందన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి రైతులందరికీ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.12 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందించాలన్న లక్ష్యంతో ప్రజాపాలనను కొనసాగిస్తుందన్నారు. అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇవ్వడంతో పాటు ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా ఇండ్లు లేని వారందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లను అందిస్తామన్నారు. అందోలు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన అన్నారు. రాయికోడ్, కప్పాడ్‌ చౌరస్తా రోడ్డు పనులను 20 రోజుల్లోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాయికోడ్‌ లో ప్రభుత్వ ఐటిఐ ఏర్పాటుకు కృషి చేస్తానని, రెసిడెన్షియల్, మోడల్‌ పాఠశాలలో సమస్యల పరిష్కారిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్, ఆలయ ఈవో శివ రుద్రయ్య, ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి తెలిపారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్‌లుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు గెలువాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు.

నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

రాయికోడ్‌లోని ప్రసిద్దిగాంచిన భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయ నూతన పాలకవర్గాన్ని నియమించారు. ఈ సందర్భంగా సోమవారం నూతన కమిటీ సభ్యులు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అలయ కమిటీ చైర్మన్‌గా కులకర్ణి ప్రభాకర్, వైస్‌ చైర్మన్‌గా గోవ్వ భీమన్న, సభ్యులుగా పి. బసవంతరావు, ఉప్పరి విటల్‌. బి.కృష్ణవేణి, బి. నర్సయ్య, జొన్నాడ దత్త రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అభివృద్దితో పాటు రాయికోడ్‌ మండల అభివృద్దికి చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి వారికి సూచించారు.

Advertisement

Next Story