- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షాల వేళ తాగునీటిపై జలమండలి ఫోకస్.. అప్రమత్తంగా ఉండాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలు
నైరుతి రుతుపవనాల ఆగమనంతో నగరంలో వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తాగునీటి నాణ్యతను పరిరక్షించేందుకు జలమండలి అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నైరుతి రుతుపవనాల ఆగమనంతో నగరంలో వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తాగునీటి నాణ్యతను పరిరక్షించేందుకు జలమండలి అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. వర్షా కాలంలో తాగు నీరు కలుషితం అవకాశం ఉండటంతో పంపిణీ వ్యవస్థలో అన్ని స్థాయిలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తొలి వర్షాల సమయంలో స్లూయిస్ వాల్వ్ ఛాంబర్లలో వర్షపు నీరు చేరే అవకాశం ఉన్నందున నీటి సరఫరా ప్రారంభించే ముందు తప్పనిసరిగా వాల్వ్‌లను నిర్వహించి లైన్లను శుభ్రపరచాలని ఎండీ ఆదేశించారు. జలమండలి పరిధిలోని అన్ని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పంపిణీ నెట్‌వర్క్ శాంప్లింగ్ పాయింట్ల వద్ద నీటి నాణ్యత పరీక్షలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. అలాగే క్లోరిన్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు రా వాటర్.. శుద్ధి చేసిన నీటిలో టర్బిడిటీ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వినియోగదారుల వద్ద కనీసం 0.2 పిపిఎం ఉండేలా చర్యలు తీసుకోవాలని, కలుషిత నీరు సరఫరా అవకాశం ఉన్న ప్రాంతాల్లో క్లోరినేషన్ మోతాదును అవసరానికి అనుగుణంగా పెంచాలని తెలిపారు. క్లోరినేషన్ పరికరాలు సక్రమంగా పనిచేసేలా చూడటంతో పాటు బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ నిల్వలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాలువలు, నాలాలు, నీరు నిలిచే ప్రాంతాల సమీపంలో ఉన్న పైప్‌లైన్‌లను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని, లీకేజీలు, దెబ్బతిన్న పైపులు, లోపభూయిష్ట వాల్వ్‌లను వెంటనే మరమ్మతు చేయాలని సూచించారు.
వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఎయిర్ వాల్వ్‌లు, స్కవర్ వాల్వ్‌లు, ఛాంబర్లలో వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రిజర్వాయర్లు, సర్వీస్ ట్యాంకుల మూతలు, వెంటిలేటర్లు, మ్యాన్‌హోల్‌లను పూర్తిగా సీలింగ్ చేసి వర్షపు నీరు, కీటకాలు, ఇతర కాలుష్య కారకాలు లోనికి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ఎండీ సూచించారు. లో ప్రెషర్ ఉన్న ప్రాంతాలను గుర్తించి పొల్యూషన్ జరగకుండా పంపిణీ వ్యవస్థలో ఎల్లప్పుడూ తగిన ఒత్తిడిని కొనసాగించాలని ఆదేశించారు. నీరు నిలిచే కీలక ప్రాంతాల్లో ప్రత్యేక ఫీల్డ్ బృందాలను మోహరించాలని, ముంపు ప్రాంతాల గుండా వెళ్లే పైప్‌లైన్‌లను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సివరేజ్ పనుల్లో సమన్వయంగా పనిచేస్తూ నీటి పైప్‌లైన్‌లు, సీవరేజ్ లైన్లు సమాంతరంగా ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, సీవరేజ్ ఓవర్‌ఫ్లోలు, లీకేజీలను అత్యవసర ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మురుగునీరు తాగునీటి వ్యవస్థలోకి ప్రవేశించకుండా చూడాలని పేర్కొన్నారు. కలుషిత నీరు సరఫరా ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే ప్రజలు నీటిని మరిగించి వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు.
పైప్‌లైన్ ధ్వంసం అయినా, పొల్యూషన్ ఘటనలు ఎదురైనప్పుడు స్పందించేందుకు ఏఏంఎస్ బృందాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాల ప్రభావం వల్ల నీటి నాణ్యత, లీకేజీలు, ప్రజా ఫిర్యాదులపై ప్రతిరోజూ సమీక్ష నిర్వహించి సంబంధిత నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించాలని ఎండీ తెలిపారు. అలాగే అధికారులు, సిబ్బంది చివరి స్థాయి క్షేత్ర సిబ్బంది వరకు ఈ సూచనలను కచ్చితంగా అమలు చేయాలని, అదే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు, సమాజంలోని వివిధ వర్గాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.






