తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్ : వైఎస్ షర్మిల

by Disha Web Desk 7 |
తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్ : వైఎస్ షర్మిల
X

దిశ, పర్వతగిరి : తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తెచ్చిన ప్రభుత్వం కేసీఆర్‌ది అని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం విస్మరించడాని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన కేసీఆర్ ఎనిమిదిన్నర సంవత్సరాల పాలనలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యకు కారణం అయ్యాడని షర్మిల ఫైర్ అయ్యారు. శుక్రవారం వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగింది. రెండవ రోజు ఏబీ తండా, దౌలత్ నగర్ మీదుగా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలానికి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేరుకుంది.

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రైతుల రుణమాఫీ, ఉచిత ఎరువులు, పోడు భూముల పట్టాల పంపిణీని మరిచి, రైతులను విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే.. అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని, వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకొస్తామన్నారు. షర్మిల పాదయాత్ర చేపట్టి నేటికి 225 రోజులు కాగా మధ్యాహ్నం వరకు పర్వతగిరికి చేరుకోని 3550 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. అనంతరం గుంటూరుపల్లి, సోమరం మీదుగా పరకాల నియోజకవర్గం తిగరాజుపల్లి, సంగెంకు చేరుకుంటుంది.

రెండో రోజూ కొనసాగిన పాదయాత్ర

దిశ,నెక్కొండ: వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉదయం ప్రారంభమై సాయిరెడ్డి పల్లి-ఏబీ తండా మీదుగా కొనసాగింది. సాయిరెడ్డి పల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు నిలువ నీడ లేకుండా పోయిందన్నారు. డబుల్ బెడ్రూంల ఊసే లేదన్నారు. ఎలక్షన్లు సమీపిస్తుండడంతో నిరుద్యోగులను మభ్యపెట్టడానికి ఉద్యోగ నోటిఫికేషన్లు వేశారని ప్రజలు, యువత మరోసారి నమ్మొద్దని అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రతిపక్ష పార్టీలుగా విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బిడ్డ చెబుతున్న ఒక్కసారి అవకాశం వస్తే సుపరిపాలన అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట కో-ఆర్డినేటర్ నాడెం శాంతి కుమార్, వివిధ జిల్లా అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed