నాలుగు రోజుల్లో పనులు పూర్తి చేయాలి : బల్దియా కమిషనర్

by Kalyani |
నాలుగు రోజుల్లో పనులు పూర్తి చేయాలి : బల్దియా కమిషనర్
X

దిశ, వరంగల్ టౌన్ : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో మూడు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు కమిషనర్ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా హన్మకొండ పరిధిలోని ఏఈల వారిగా అమ్మ పాఠశాలల్లో పూర్తి చేసిన, కొనసాగుతున్న వివిధ పనుల వివరాలను సమీక్షిస్తూ ఇంజనీరింగ్ అధికారులు సాంకేతిక నిపుణులను, జాప్యం లేకుండా వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు.

వరంగల్ పరిధిలోని 85 పాఠశాలల్లో పనులు గ్రౌండ్ అయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. పనులు పెండింగ్ లో ఉంటే వాటి జాబితా అందజేయాలని అన్నారు. పాఠశాలలో నిర్వహించబోయే పనుల నిర్వహణ పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని రోజుల్లో పనులు పూర్తి చేస్తారో తెలియజేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టని పాఠశాలల్లో పనులు ప్రారంభించాలని అన్నారు. పూర్తి కావాల్సిన పనులకు సంబంధించి ఏ ఈలకు నిర్దిష్ట గడువు విధించి పూర్తి అయ్యేలా చూడాలన్నారు. హన్మకొండ వరంగల్ జిల్లాల పరిధిలో ఇప్పటివరకు పూర్తి అయిన పూర్తి చేయాల్సిన ఎలక్ట్రిఫికేషన్ పనుల వివరాలు అందించాలన్నారు.

పనులు పూర్తి చేయించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారులదే నని అన్నారు. అలాగే బల్దియా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డీసిల్టింగ్ పనుల పురోగతిని సమీక్షిస్తూ యంత్రాలు వెళ్ళలేని ప్రాంతాల్లో మాన్యువల్ గా సిల్టింగ్ పనులు నిర్వహించాలని నెల రోజుల నుండి కొనసాగుతున్న సిల్టింగ్ పనుల పురోగతి సంబంధ సమాచారం అందుబాటు లో ఉండాలని అన్నారు.పూర్తి చేయాల్సిన డీసిల్టింగ్ పనుల పై స్పష్టత అవసరమన్నారు.

ఇరిగేషన్ విభాగం వారితో సమన్వయం చేసుకొని డిసిల్టింగ్ పనులు పూర్తి చేయాలని కాల్వల్లో సిల్ట్ తీయగానే వెంటనే డంప్ యార్డుకు తరలించేలా చూడాలన్నారు. హన్మకొండ పరిధిలో డిసిల్టింగ్ పనులు ఆశాజనకంగా లేదని అట్టి పనులను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో ఎస్ఈ కృష్ణారావు, ఈఈలు రాజయ్య, శ్రీనివాస్, సంజయ్ కుమార్,డిఈలు రవి కుమార్, సంతోష్ బాబు, శివానంద్, రంగారావు, రవికిరణ్, సారంగం, అజ్మీరా శ్రీకాంత్, వరంగల్ ఎంఈఓ విజయ్ కుమార్, ఎంఎన్ఓ వరంగల్ అశోక్ కుమార్, ఎంఎన్ఓ ఖిలా వరంగల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed