ఏనుమాముల మార్కెట్‌కు ఏమైంది? దోపిడీకి దారులు తెరుస్తున్నారా..?

by Disha Web Desk 7 |
ఏనుమాముల మార్కెట్‌కు ఏమైంది? దోపిడీకి దారులు తెరుస్తున్నారా..?
X

దిశ, వరంగల్‌ టౌన్‌ : ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దది వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌.. కానీ పాలన విషయంలో మాత్రం పరాయి మార్కెట్లను అనుసరించాల్సిన పరిస్థితి దాపురించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర మార్కెట్లను ఆదర్శంగా నిలవాల్సిన ఈ మార్కెట్టు పాలన తీరు నలుగురు నవ్వుకునే స్థాయికి దిగజారుతోందా? ఇటీవల మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. అసలు ఏనుమాముల మార్కెట్లో జరుగుతున్నదేమిటీ? ఖమ్మం మార్కెట్‌కు పోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందీ?

అసలు కథ ఏంటంటే

మార్కెట్‌లో ఇప్పటివరకు బస్తా బరువు కింద బస్తాకు ఒక కిలో చొప్పున వ్యాపారులు తరుగు తీస్తూ వస్తున్నారు. తరుగుతోపాటు బస్తా కూడా వ్యాపారులే తీసుకుంటున్నారు. బస్తా తీసుకుంటున్నందున తమకు బస్తా ధర చెల్లించాలంటూ రైతులు డిమాండ్‌ లేవనెత్తారు. తాము కోరుతున్నది న్యాయమైన కోరికేనని రైతులు ఆందోళనలు చేపట్టారు. నిరసనలు వ్యక్తం చేశారు. అధికారులకు వినతులు సమర్పించారు. అయితే, వ్యాపారులు మాత్రం ససేమిరా అన్నారు. ఇతర మార్కెట్లలో బస్తాలకు ధర చెల్లిస్తున్నారని, తమకు కూడా చెల్లించాలని రైతులు, రైతు సంఘాలు పట్టుబట్టారు.

ఈ క్రమంలో ఖమ్మం మార్కెట్‌లో పరిస్థితులను పరిశీలించి, అక్కడ ఎలా ఉంటే అలా అనుసరించాలనే నిర్ణయానికి వచ్చారు. ఎట్టకేలకు ఖమ్మం మార్కెట్‌ను పరిశీలించిన అనంతరం వరంగల్‌ మార్కెట్‌లో రైతుల డిమాండ్‌ మేరకు బస్తాకు రూ.30 చెల్లించేందుకు వ్యాపారులు అంగీకరించారు. కొంతకాలంగా చెల్లిస్తున్నారు. అయితే, ఖమ్మం మార్కెట్‌లో బస్తాకు ధర చెల్లించడంతోపాటు కొన్ని షరతులు కూడా అమలవుతున్నాయి. ఆ నిబంధనలు ఇక్కడ కూడా అమలు చేయాలంటూ తాజాగా వరంగల్‌ వ్యాపారులు పట్టుబడుతున్నారు. అయితే, ఆ నియమాలు రైతులకు అన్యాయం చేసేలా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఖమ్మంలో నిలువు దోపిడే

ఖమ్మంలో పరిస్థితులను పరిశీలిస్తే రైతులను నిలువు దోపిడీ చేస్తున్నట్లు ఇట్టే అర్థమైపోతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి బస్తాకైనా రూ.25 చెల్లిస్తున్న వ్యాపారులు.. బస్తాకు 50 కిలోల సరుకు మించకూడదని షరతు విధించారు. అంతేనా.. మామూలుగా బస్తా బరువు కింద కిలో కోత విధించడంతో 50 కిలోలకు సరుకు మించితే మరో కిలో అదనంగా కోత విధిస్తున్నారు. అంతేకాదు, ఒకవేళ 50 కిలోలకంటే తక్కువగా.. 49 కిలోల 800 గ్రాములు ఉంటే, రౌండ్‌ ఫిగర్‌గా 49కిలోలకే లెక్క వేస్తున్నారు. ఇదీ ఖమ్మంలో అనుసరిస్తున్న విధానం. దీంతో రైతులకు నష్టం జరగనుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అయితే, ఆ పద్ధతినే కొనసాగించాలని వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌ వ్యాపారులు పట్టుబడుతున్నారు.

రైతులకు నష్టమే

సరాసరి 50 కిలోలు బస్తాలో కుదించాలంటే ఒకింత కష్టమే. ఎంత అంచనా వేసి కుదించినా ఎంతోకొంత ఎక్కువగానో, తక్కువగానో ఉంటుందనేది వాస్తవం. ఒకవేళ సరాసరిగా తీసుకొచ్చినా సరుకు పరిశీలన పేరుతో వ్యాపారులు బస్తా నుంచి ఎంత తీస్తారనేది ఊహించలేం. అలా అని ఎక్కువగా తెచ్చినా... పరిశీలన పేరిట సరుకు తీయగా, నిబంధన కొలత కంటే ఎక్కువగానే మిగిలే అవకాశం ఉంటుంది. పోనీ సరాసరి తెచ్చినా అరకిలో అటోఇటో రౌండ్‌ ఫిగర్‌కు తగ్గే ఛాన్స్‌ ఉంటుంది. ఇలా బస్తాకు ఒక్కంటికి కిలో, అరకిలో చొప్పున కోత విధిస్తే.. పెద్దమొత్తంలో సరుకు తీసుకొచ్చిన రైతు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. పత్తి, మిర్చి రైతులపై ఈ ప్రభావం అధికంగా పడే ప్రమాదం ఉంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఇదేమీ ఖర్మం..!

ఏనుమాముల మార్కెట్టు ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదిగా చెబుతుంటారు. అంటే ఈ మార్కెట్టు కంటే తెలంగాణలోని మార్కెట్లు అన్నీ చిన్నవే కదా! ఎక్కడ్కెనా పెద్దరికం నుంచి చిన్నరికం నేర్చుకుంటుంది. కానీ, ఇక్కడ మాత్రం వింత పరిస్థితి నెలకొంది. రైతులు, వ్యాపారుల మధ్య నిబంధనలు, నియమాలపై ఇతర మార్కెట్లకు ఆదర్శంగా నిలవాల్సిన ఏనుమాముల మార్కెట్టు ఇతర మార్కెట్లను అనుసరించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే పెద్దరికమా అంటూ రైతులు విమర్శిస్తున్నారు. ఖమ్మంలో జరుగుతున్నది దోపిడీ అని గుర్తించాల్సిన అధికారులు, పాలకులు.. ఇక్కడ అమలు చేసేందుకు చర్చలు జరపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

వ్యాపారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు..?

ఇదిలా ఉండగా, బస్తా రేటు.. తాజా నిబంధనలపై ఫిబ్రవరి 4వ తేదీన సమావేశం నిర్వహించాలని జనవరి 24న వ్యాపారులు ఆందోళనకు దిగిన సందర్భంలో నిర్ణయించారు. ఈ మేరకు శనివారం హన్మకొండలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, మార్కెట్‌ పాలకవర్గం, వ్యాపారులు, అధికారులు, రైతు సంఘాల నాయకులు భేటీ కానున్నారు. బస్తా రేటు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న వ్యాపారులు తాజా నిబంధనలపై ఎలా స్పందిస్తారనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ వ్యాపారులు బెట్టు మీదే ఉంటే కొనుగోళ్లు నిలిపివేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దేశానికి రైతే వెన్నెముకగా చెప్పుకునే పాలకులు, రైతులే దేవుళ్లుగా భావించే వ్యాపారులు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రైతులకు ఏమేరకు మేలు చేయనున్నారు? అనేది వేచిచూడాల్సిందే. ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ఈ సమస్య ప్రభుత్వానికి సవాల్‌గా మారనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోపక్క మార్కెట్‌ అధికారులు వ్యాపారులకే వత్తాసు పలుకుతారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యాపారుల నిర్ణయానికి తలొగ్గుతారా? లేదంటే రైతులకు సమ్మతమైన నిర్ణయాన్ని తీసుకుంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. మార్కెట్‌లో నెలకొన్న ఈ అనిశ్చిత పరిస్థితులకు ఎప్పుడు తెరపడనుందో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed