- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం

దిశ, ములుగు ప్రతినిధి : ఈనెల 12 నుండి 15 వరకు మేడారం గ్రామంలో జరగనున్న మినీ మేడారం జాతరను విజయవంతం చేయడానికి భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. గురువారం తాడ్వాయి మండలంలోని మేడారంలో పలు శాఖల అధికారులతో కలిసి వైద్య శిబిరం ఏర్పాటు, జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను, మహిళలు బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన గదులను పరిశీలించిన అనంతరం గద్దెల ప్రాంతంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు. వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయాలలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట, చోరీలు జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జంపన్న వాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులతో నిరంతరం శుభ్రం చేయించాలని డీపీఓను ఆదేశించారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లను ఏర్పాటు చేయడమే కాకుండా మ్యాట్లను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందని వివరించారు. జాతరను పురస్కరించుకొని పలుచోట్ల ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, తాగునీటి కొరత ఏర్పడకుండా నిరంతరం నీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.
నాలుగు రోజుల పాటు జరిగే జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు హనుమకొండ జిల్లా కేంద్రం నుండి నిరంతరం బస్సులను మేడారం నడిపించనున్నారని, జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తమ మొక్కులను చెల్లించుకొని తిరుగు ప్రయాణం కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, డీపీఓ దేవరాజ్, డీఎం అండ్ హెచ్ ఓ గోపాల్ రావు, ఇరిగేషన్ ఈఈ నారాయణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.