- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రూ.20 లక్షల కోట్లు ఇచ్చాం

దిశ, వరంగల్ బ్యూరో : బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మరో రూ. 10 లక్షల కోట్లు రుణాలరూపంలో అందజేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపుతోందన్న కాంగ్రెస్ నేతల విమర్శల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కేటాయింపు చేసిన నిధుల వివరాలను వెల్లడించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ విషయంపై చర్చకు కూడా తాను సిద్ధమన్నారు. అర్థం లేని వాదనలకు, విమర్శలకు కేంద్ర మంత్రి హోదాలో అందరికీ తాను స్పందించలేనని అన్నారు.
అయితే మీడియా ద్వారా వెల్లడిస్తున్న వివరాలకు తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రామగుండంలో రూ. 7 వేల కోట్లతో యూరియా యూనిట్, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, జాతీయ రహదారుల కోసం రూ. 1.20 లక్షల కోట్లు, రూ. 80 వేల కోట్ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. వరంగల్ స్మార్ట్ సిటీ పనులు, రామప్ప దేవాలయానికి రూ. 150 కోట్ల కేటాయింపు, యూనిస్కో గుర్తింపు, 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ, కొమురవెళ్లి రైల్వే స్టేషన్, సమ్మక్క సారాలమ్మ దేవాలయ అభివృద్ధికి రూ. 1000 కోట్లు, ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1350 కోట్లు, హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ కు పచ్చజెండా ఊపడం జరిగిందన్నారు. అలాగే ఎన్టీపీసీ 850 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, ఫ్లోటింగ్ యూనిట్, ఎరువులపై రూ. 60వేల కోట్ల సబ్సిడీ, కిసాన్ సన్మాన్ నిధి, గ్రామ పంచాయతీలకు రూ. 13వేల కోట్లు, ఇన్ కంట్యాక్స్ రూ. 12.75 లక్షల వరకు తగ్గింపు, జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్కు, ఐదు కేజీల ఉచిత బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అసాధ్యం
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అసాధ్యమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చేశారు. గతంలో నిర్వహించిన పలు సర్వేల్లో ఇనుము ముడి ఖనిజంలో నాణ్యత లేదని తేలిపోయిందని అన్నారు. అయితే ఇప్పుడున్న పలు స్టీల్ పరిశ్రమలు మూతపడుతున్న వేళ కొత్తగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం అన్నది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని అన్నారు. అయితే గతంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన వాగ్దానాన్ని ఆ పార్టీ నేతలు మరిచిపోయినట్లుగా ఉన్నారని, తామే సొంతంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చంకలు గుద్దుకున్నారని, కానీ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎందుకు ముందుకెళ్లలేకపోయారో చెప్పాలని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతివారం ఢిల్లీకి వెళ్లడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అక్కడి రాహుల్ మాటలను ఇక్కడకు మోసుకువచ్చి మోదీ, బీజేపీలపై విమర్శలు చేయడం తప్ప ఆయన చేపట్టే పర్యటనల్లో మర్మం ఏమీ లేదన్నారు. తెలంగాణ ప్రజలు అనేక మంది సీఎంలను, మంత్రులను చూశారని, పోలీసు నిర్భంధాలను, తూటాలను ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి హామీలను తుంగలో తొక్కేలా వైఫల్యాల నుంచి తప్పించుకుంటున్నారని అన్నారు.
బీజేపీకి సానుకూల ఫలితాలు..
ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయ, పట్టభద్రుల మూడు ఎన్నికల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూడుస్థానాల్లో బీజేపీకి సుహృద్భావ వాతావరణం కనిపిస్తోందని అన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌పై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. బీజేపీకి ఈ ఎన్నికలు పూర్తి సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయని తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను శాసనమండలి ద్వారా నెరవేర్చాలని, మూడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఉద్యమకారులు, జేఏసీలో పనిచేసిన సంఘాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్ధతునిస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సర్వోత్తం రెడ్డి వరంగల్, ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారని అన్ని సంఘాలు, ఉపాధ్యాయులు అభిమానించే వ్యక్తి అని కిషన్ రెడ్డి కొనియాడారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కొమురయ్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని,. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అంజిరెడ్డి పోటీ చేస్తున్నారని తెలిపారు. ప్రజలు, పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఆశీస్సులతో విజయం సాధిస్తామన్నారు.