వరంగల్‌ బల్దియా అధికారులు కాళ్లు కదపరు.. కళ్ళు తెరవరు

by Disha Web Desk 12 |
వరంగల్‌ బల్దియా అధికారులు కాళ్లు కదపరు.. కళ్ళు తెరవరు
X

దిశ, వరంగల్‌ టౌన్‌ : వరంగల్‌ బల్దియా అధికారుల తీరు ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది.ఆఫీస్ కుర్చీలను అంటిపెట్టుకుని అధికారం వెలగబెడుతుండడం నగరవాసులకు శాపంగా పరిణమిస్తోంది.ముఖ్యంగా టౌన్‌ ప్లానింగ్‌ విభాగం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు సమస్యల్లో చిక్కు కోవాల్సిన దుస్థితి నెలకొంది. లంచాలకు అలవాటు పడి పోయారో,లేదా ప్రజాప్రతినిధులు అండతోనే అధికారుల అలసత్వం భూ వివాదాలకు దారి తీస్తోంది. ఇందుకు భూకబ్జాలపై గ్రీవెన్స్‌సెల్‌కు వెల్లువెత్తుతున్న వినతులే నిదర్శనంగా నిలుస్తున్నాయి.ప్రతీవారం ఇద్దరు,ముగ్గురు బాధితులు తమ ప్లాట్లు,స్థలాలు కబ్జాకు గురయ్యాయంటూ,తమ భూముల్లో ఇతరులు అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేయించాలంటూ ఫిర్యాదు చేస్తుండడం వరంగల్‌ మహానగర పాలక సంస్థ అధికారులకు విధుల పట్ల ఉన్న నిబద్ధతకు నిలువుటద్దం పడుతోంది.

గుడ్డిగా అనుమతులు!

ఇంటి యాజమాన్యం వివరాలు మార్పిడి,ఇంటి నంబర్ల కేటాయింపు, ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల పేరిట నిత్యం ఆన్‌లైన్‌ దరఖాస్తులు బల్దియాకు చేరుతుంటాయి. ఆయా దరఖాస్తులను ముందుగా పరిశీలించి,ఆ తర్వాత సదరు స్థలాల వద్దకు అధికారులు వెళ్లి విచారణ చేపట్టిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ,వరంగల్‌ మహానగర పాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ చేపట్టకుండానే గుడ్డిగా కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని అనుమతులు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివిధ అనుమతుల నిమిత్తం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించగానే కార్పొరేటర్‌ లేదా పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుడి నుంచి ఫోన్‌ రాగానే అనుమతి పత్రాల మీద సంతకాలు చేస్తున్నట్లు బల్దియాలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఒక్కో దరఖాస్తుకు రూ.10వేల నుంచి రూ.50 వేల వరకు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఏదైనా అర్జీ నిబంధనలకు పూర్తిగా అనుకూలంగా లేకున్నా, కోర్టు కేసుల్లో ఇరుకున్న స్థలాలైనా అధికారులకు లక్షల్లో పంట పండినట్లేనని విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ పనిలో ఆర్‌ఐలు ఆరితేరిపోయారనే ఆరోపణలు లేకపోలేదు.

ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు..

అధికారుల తీరు కబ్జారాయుళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు, ఆన్‌లైన్‌లో వివరాలు సేకరించి.. ఆ తర్వాత నకిలీ పత్రాలు సృష్టించి,ఆయా స్థలాలను తమ పేరిట రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో డబ్బులు కుమ్మరించి, మార్చుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆ దస్తావేజులతో మున్సిపల్‌ కార్యాలయంలో యాజమాన్యపు హక్కులతోపాటు ఇంటి నంబర్‌, ఇంటి నిర్మాణ అనుమతులు దొడ్డిదారిన పొంది అసలు యజమానులపై దౌర్జన్యానికి దిగుతున్నట్లు తెలుస్తోంది. తమ స్థలాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయని ఆలస్యంగా తెలుసుకుంటున్న అసలు యజమానులు లబోదిబోమంటూ బల్దియా ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బల్దియా గ్రీవెన్స్‌కు భూకబ్జాలపై వేలల్లో అర్జీలు వచ్చి ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్‌సెల్‌కు ముగ్గురు బాధితులు మొరపెట్టుకోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తన భూమి ఆక్రమణకు గురై కోర్టులో దావా నడుస్తున్నా.. కబ్జాదారు అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని,ఆ పనులను నిలిపివేయించాలని కోరుతూ పైడిపల్లికి చెందిన రాసోజు సత్యనారాయణ గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీ పెట్టుకున్నాడు.అలాగే నగరానికి చెందిన మరో వ్యక్తి సైతం తన ఇంటి గోడను ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నాడంటూ ఫిర్యాదు చేయడం చూస్తుంటే నగరంలో ఆక్రమణల పర్వం ఎంతగా పెరిగిపోయిందో అర్థమవుతోంది.

కాళ్లు కదపాలి.. కళ్లు తెరవాలి..

కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల నగరంలో వందల సంఖ్యలో ప్రజలు కబ్జారాయుళ్ల దురాగతానికి నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజాప్రతినిధులకు కొమ్ము కాస్తూ.. అక్రమ సంపాదన కు అలవాటు పడిన అధికారుల తీరు నిరుపేద, అమాయక ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి, కాళ్లు కదిపి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత అనుమతులిచ్చి నిరుపేదలకు తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బల్దియా ఉన్నతాధికారులకు, పాలకవర్గానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


Next Story