మామూళ్ల మత్తులో అటవీశాఖ..? అక్రమ కలపకు అడ్డేది..?

by Disha Web |
మామూళ్ల మత్తులో అటవీశాఖ..? అక్రమ కలపకు అడ్డేది..?
X

దిశ, దంతాలపల్లి : ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదం అధికారుల అలసత్వంతో కాగితాలకే పరిమితమైంది. అటవీని రక్షించడంతో పాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వాల్టా చట్టం రూపొందించింది.

చెట్లను నరికివేయాలంటే అటవీశాఖ, రెవెన్యూశాఖ సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ఒకవేళ తీసుకున్న పరిమితికి మించి దండుకుంటున్నారు. దీంతో అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను, వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి మామిడి చెట్లను నరికి వేస్తూ, పెద్ద పెద్ద వృక్షాలను నేలకూలుస్తూ ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. వన సంపద సంరక్షణ కోసం తీసుకువచ్చిన వాల్టా చట్టం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది.

కాసులు కురిపిస్తున్న దందా

వేప, తుమ్మచెట్లను సైతం అక్రమార్కులు వదలడం లేదు. పంట చేలు గుట్టల ప్రాంతాలలోని చెట్లు, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన వృక్షాలు నేలకులుస్తున్నారు. కలప వ్యాపారులు తక్కువ ధరకు చెట్లను కొనుగోలు చేస్తున్నారు. వాటిని నరికి వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ క్వింటాళ్ల చొప్పున అమ్ముకుంటున్నారు. చెట్ల నరికివేతపై అధికారుల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కలపను అధిక ధరలకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

దళారులపై చర్యలు తీసుకోవాలి

మొక్కలను పెంచడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయిలు కేటాయిస్తూ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు చెట్టు ఆవశ్యకతను వివరించాలి. చెట్లను నరికివేసిన కారణంగా భవిష్యత్‌లో మరిన్ని కరువు కాటకాలు వచ్చే ప్రమాదముంది. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా చెట్లను సంరక్షించాలి.

అధికారుల నిర్లక్ష్యం

ఇప్పటికే రాష్ట్రంలో 33 శాతం ఉన్న అడవులను పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకాన్ని నీరుకారుస్తూ మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలంలో స్మగ్లర్లు అక్రమంగా కలపను రవాణా చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా.. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధునిక యంత్రాలను వినియోగించి గుట్టుచప్పుడు కాకుండా చెట్లను నరికి వేస్తూ వాహనాల్లో తరలిస్తున్నారు.

అధికారులకు నెలవారీ మామూళ్లు.. పార్టీలు..!

మండలంలో కలప అక్రమంగా రవాణా చేస్తూ, తమ అనుచరులతో అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్పిస్తున్నట్లు మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నెలవారీ మామూళ్లుకి అలవాటు పడిన అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడంతో కలప రవాణా వ్యాపారుల ఆడిందే ఆట.. పాడిందే పాట.. లాగా తమ దందాను మూడు కొమ్మలు.. ఆరు చెట్ల లాగా కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమా సెట్టింగ్‌ను తలపించేలా బొగ్గు బట్టీలు

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం, సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం సరిహద్దుల్లో భారీగా బొగ్గు బట్టీలు వేసి నిశీధి మొదలు ట్రాక్టర్ల సాయంతో కర్రను తరలిస్తున్నారు.Next Story