భూమిని అమ్మే ప్రసక్తే లేదు : లబ్ధిదారులు

by Disha Web Desk 15 |
భూమిని అమ్మే ప్రసక్తే లేదు : లబ్ధిదారులు
X

దిశ, భీమదేవరపల్లి : పుస్తెలు అమ్ముకొని కొనుక్కున్న భూమిని అమ్మేదే లేదని, తమ భూమి తమకే కావాలని గౌడ కుటుంబాలు ఆందోళనకు దిగిన ఘటన మండలంలోని కొత్తపల్లిలో చోటుచేసుకుంది. గౌడ కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సర్వే నంబర్ 57,58,59 లో గౌడ కులస్తులకు సుమారు 7 ఎకరాల భూమి ఉంది. గౌడ కులంలో 59 కుటుంబాలకు చెందిన భూమిలో నుండి మూడు ఎకరాల భూమి హనుమకొండకు చెందిన శుభ గమనం డెవలపర్స్ కంపెనీవారికి అమ్మడానికి గౌడ సంఘం నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. 40 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నారు.

మిగిలిన మొత్తం తొమ్మిది నెలల్లో చెల్లించి లే అవుట్ ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. కానీ మూడు సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని వాపోయారు. మూడు సంవత్సరాల నుండి అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని కాసగోని భాగ్యవ్వ ఇటీవల చనిపోగా ఆమె దహన సంస్కారాలకు సైతం డబ్బులు లేక మృతురాలి బిడ్డలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. తమ పిల్లల పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు అయ్యామని, మాకు అవసరం ఉన్నప్పుడు చేతికందని డబ్బు ఇక మాకు వద్దని భూమిని అమ్మేది లేదని అన్నారు. భూమి అమ్మకం విషయంలో గౌడ సంఘం నాయకులు అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ భూమిని అమ్మేదే లేదని స్పష్టం చేశారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం భూమిలో గుడిసెలు వేసుకొని వంటావార్పు నిర్వహించారు. కార్యక్రమంలో సౌందర్య, మానస, సరోజన, కలవ్వ, లత, రమాదేవి, శ్రీలత, మధురవ్వ, కళావతి, లక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed