సార్‌లు లేరు..చదువు సాగేదెలా..!

by Aamani |
సార్‌లు లేరు..చదువు సాగేదెలా..!
X

దిశ, మంగపేట : వేసవి సెలవులు ముగిసి బుధవారం నుంచి బడులు ప్రారంభం కానున్నాయి. మండలంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలు 06, ప్రాథమికోన్నత పాఠశాలలు 08, ప్రాథమిక పాఠశాలలు 31, టీడబ్ల్యుపిఎస్ 21, ఆశ్రమ పాఠశాలలు 03, కేజీబీవీ 01 ఉండగా మొత్తం 216 మంది ఉపాధ్యాయులు పని చేయాల్సి ఉండగా వారిలో నుండి 370 జీవోలో బదిలీపై వచ్చిన 18 మంది అనేక కారణాలతో డిప్యూటేషన్ లో ఉండగా మరో 49 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలే ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతున్నాయనే కారణంతో తల్లిదండ్రులు ప్రైవేటు బాట పడుతుండగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా తమ పిల్లలకు నాణ్యమైన చదువు అందదేమోననే భావంతో అయిష్టత చూపుతున్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందు ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహించినప్పటికీ గ్రామాల్లో ప్రభుత్వ బడుల పట్ల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇప్పటి వరకు మండలంలోని 70 పాఠశాలలో కేవలం 150 మంది వరకు బడిబయట, బడిఈడు పిల్లలను మాత్రమే ఎన్ రోల్ చేసినట్లు సమాచారం.

సమస్యల వలయంలో సర్కారు బడులు మండలంలోని సర్కారు బడులు అనేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయనే ఆరోపణలున్నాయి. తరగతి గదుల కొరతతో పాటు ఉన్న గదులకు కిటికీలు, తలుపులు, మూత్రశాలలు, ఉన్నవాటిలో నిర్వాహణలోపంతో అపరిశుభ్రత, పాఠశాలల మరమత్తులు లేక రేకులు లేచి ఉండడం, ప్రహరీ గోడలు లేకపోవడం, సురక్షితమైన తాగునీటి వ్యవస్థ లేకపోవడం, విద్యార్థుల సంఖ్యను బట్టి తరగతి గదులు లేకపోవడం, ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు సంవత్సరాల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు..

మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల కేటగిరీలో 49 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీజీ హెచ్ఎంలు 02, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు 04, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 05, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ 01, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ 04, స్కూల్ అసిస్టెంట్ సోషల్ 09, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 01, స్కూల్ అసిస్టెంట్ హిందీ 02, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 05, లాంగ్వేజ్ పండిట్ తెలుగు 01, లాంగ్వేజ్ పండిట్ హిందీ 04, ఎస్జీటీ తెలుగు 08, ఎస్జీటీ ఇంగ్లీష్ 02, ఫిజికల్ డైరెక్టర్ 01, పీఈటీ 04 పోస్టులు తగ 5 సంవత్సరాలుగా ఖాళీలున్నాయి.

డిప్యూటేషన్లపై 18 మంది డుమ్మా..

ప్రభుత్వ పాఠశాలల్లో అసలే అత్తెసరు చదువులు ఉన్నాయంటే 370 జీవోలో మండలానికి వచ్చిన సుమారు 18 మంది ఉపాధ్యాయులు తమ రాజకీయ పలుకుబడితో డిప్యూటేషన్లపై ఉన్నారు. ఉపాధ్యాయుల కొరతకు తోడు డిప్యూటేషన్లపై వెళ్లడంతో విద్యార్థులకు వార్షిక సిలబస్ పూర్తికాక పరీక్షలకు సన్నద్ధంకాలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సమయంలో చూచిరాతలపై ఆధారపడి ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్ చదువులకు వెళ్లిన విద్యార్థులు సగానికి ఎక్కువగా ఫెయిల్ అవుతున్నారనే అభిప్రాయాలున్నాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి..

మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల కొరత డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాద్యాయుల విషయంలో జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించాలని తల్లి తండ్రులు కోరుతున్నారు. బుదవారం నుండి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో పాఠశాలల్లోని అసౌకర్యాలపై దృష్టి సారించి పనులు పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed