ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి : కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-09 09:59:34  IST  )

ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పొందేందుకు విద్యార్థుల సంఖ్యలు పెంచాలని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి : కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పొందేందుకు విద్యార్థుల సంఖ్యలు పెంచాలని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత మెరుగుదల, ఎఫ్ఎల్ ఎన్ మిషన్, ఎఫ్ఆర్ఎస్ హాజరు, బడిబాట కార్యక్రమం నిర్వహణ, పాఠశాలల పునఃప్రారంభ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాలలో 10 శాతం మేర విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చూడాలని, విద్యార్థులకు కల్పిస్తున్న మెరుగైన సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని జీరో పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల నమోదుకు కృషి చేయాలని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు.

జిల్లాలోని ప్రతి పాఠశాలను విద్యాశాఖ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, బోధన, హాజరు, మౌలిక సదుపాయాల పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, శానిటేషన్, విద్యుత్, ఫర్నిచర్, పరిశుభ్రత వంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలుపుతూ చిన్నబోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 12 మంది నుంచి 120 మందికి పైగా పెంచడంలో విశేష కృషి చేసిన కానిస్టేబుల్ ధూపాటి సతీష్, గ్రామ సర్పంచ్‌ను జిల్లా కలెక్టర్ అభినందించారు. సమావేశంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి ఏ సిద్ధార్థ రెడ్డి,ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కొప్పుల మల్లేశం, డి ఎమ్ & హెచ్ ఓ గోపాలరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, విద్యాశాఖ అధికారులు ఉన్నారు.

Next Story