ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్‌లో హై టెన్షన్.. తొలి జాబితాపై ఎమ్మెల్యేలు, ఆశ‌వాహుల్లో తీవ్ర ఉత్కంఠ‌

by Disha Web Desk 19 |
ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్‌లో హై టెన్షన్.. తొలి జాబితాపై ఎమ్మెల్యేలు, ఆశ‌వాహుల్లో తీవ్ర ఉత్కంఠ‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ఈనెల 21 బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ విడుద‌ల చేయ‌నున్నార‌నే ప్రచారంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల నుంచి టికెట్ రేసులో ఉన్న ఆశ‌వ‌హుల్లో హై టెన్షన్ క‌న‌బ‌డుతోంది. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని 12 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి తొలి జాబితాలో మెజార్టీ స్థానాల‌కు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత ఖ‌రారు చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే కొన్ని స్థానాల‌కు అభ్యర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్లుగా లీకులు రావ‌డంతో అయా నియోజ‌క‌వ‌ర్గంలో అస‌మ్మతి, సంబ‌రాలు జ‌రుగుతున్నాయి. అయితే ఈ లీకుల్లో ఎంత నిజం ఉంది..? ఎవరు బ‌రిలో ఉండ‌బోతున్నారు..? ఎవ‌రికి నిరాశ ఎదుర‌కాబోతోంద‌న్న దానిపై బీఆర్ఎస్ పార్టీతో పాటు విప‌క్షాల్లోనూ పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. అధికార పార్టీ అభ్యర్థుల ప్రక‌ట‌న త‌ర్వాత విప‌క్షాల వైఖ‌రిలో మ‌రింత స్పష్టత రానుంది. అదే స‌మ‌యంలో టికెట్ రాని ఎమ్మెల్యేలు, ఆశ‌వ‌హులు తీసుకోబోయే నిర్ణయాలు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల‌పై ప్రభావం చూపే అవ‌కాశం ఉంది.

తొలి జాబితాలో ఉండేదెవ‌రు..!?

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రస్తుతం 11 సీట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సిట్టింగ్‌లుగా ఉన్నారు. పాల‌కుర్తికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావుకు, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్ విన‌య్‌భాస్కర్‌కు, న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్ రెడ్డి, వ‌ర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు టికెట్ పోరు లేక‌పోవ‌డంతో ఈ స్థానాల్లో మ‌ళ్లీ వారికే టికెట్లను ఇచ్చే అవ‌కాశం ఉంది. తొలిజాబితాలోనే వీరి పేర్లు ఉంటాయ‌ని తెలుస్తోంది.

ఇక గ‌తంలో కేటీఆర్ ప‌ర్యట‌న‌ల్లో భూపాల‌ప‌ల్లిలో గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి, ప‌ర‌కాల‌లో చ‌ల్లా ధ‌ర్మారెడ్డికే మొగ్గు చూపుతూ వారికే టికెట్ ఇవ్వ‌బోతున్నామ‌ని కూడా చెప్పారు. తొలి జాబితాలోనే వీరిద్దరి పేర్లు కూడా ఉంటాయా..? ఉండ‌వా అన్నది వేచి చూడాలి. ఇక మిగిలిన జ‌న‌గామ‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, వ‌రంగ‌ల్ తూర్పు, డోర్నక‌ల్‌, మ‌హ‌బూబాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై ఇప్పటి వ‌ర‌కు అధిష్ఠానం పెద్దలు ఎలాంటి ప్రకట‌న చేయ‌లేదు. ములుగు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బ‌డే నాగ‌జ్యోతి నిల‌పాల‌ని అధిష్ఠానం భావిస్తున్నట్లు స‌మాచారం. అలాగే ఎమ్మెల్సీ స‌త్యవ‌తి రాథోడ్‌ను కూడా ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

జ‌న‌గామ తెర‌పైకి ప‌ల్లా.. పోచంప‌ల్లిలోనూ ఆశ‌లు

జ‌న‌గామ‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తండంతో ఆయ‌న్ను ప‌క్కన పెట్టేయ‌డం దాదాపు ఖ‌రారైన‌ట్లేన‌న్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ఆయ‌న స్థానంలో ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డికి అవ‌కాశం క‌ల్పించేందుకు కేసీఆర్ నిర్ణయించిన‌ట్లుగా ప్రచారం జ‌రుగుతోంది. ఈమేర‌కు జ‌న‌గామ‌లో, తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా మూడు రోజులుగా ముత్తిరెడ్డి అనుచ‌రులు ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు.

ఇదే స్థానం నుంచి కేటీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడైన‌ ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస‌రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు. ఈ స్థానంలో ప‌ల్లాకే ఖ‌రారైన‌ట్లుగా బీఆర్ఎస్ ముఖ్య నేత‌ల ద్వారా తెలుస్తుండ‌గా పోచంప‌ల్లి సైతం ఆశ‌లు పెట్టుకున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ నాగ‌పురి రాజ‌లింగం త‌న‌యుడు కిర‌ణ్ పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం.

స్టేష‌న్‌లో క‌డియం, రాజ‌య్య‌ల మ‌ధ్య పోరు

స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ‌య్య, ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రిల మ‌ధ్య తీవ్రమైన టికెట్ పోరు కొన‌సాగుతోంది. క‌డియంకే టికేట్ క‌న్ఫార్మ్ అయింద‌ని ప్రచారం జ‌రుగుతుండ‌టంతో రాజ‌య్యకు మ‌ద్దతుగా, క‌డియంకు వ్యతిరేకంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. తాను కేసీఆర్‌ను న‌మ్ముకున్నాన‌ని, కేసీఆర్‌కు త‌న‌కు అన్యాయం చేయ‌డ‌ని మూడు రోజుల క్రితం రాజ‌య్య భ‌ద్రకాళిలో రాజ్యశ్యామ‌ల యాగం త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. అదే స‌మ‌యంలో రాజ‌య్యకే టికెట్ ఇవ్వాలంటూ కేసీఆర్‌ను క‌లిసేందుకు ఆయ‌న వ‌ర్గీయులు హైద‌రాబాద్‌కు త‌ర‌లివెళ్లడం విశేషం. అదే స‌మ‌యంలో క‌డియం వ‌ర్గీయుల్లో ఆనంద‌రం వెల్లివిరుస్తోంది.

వ‌రంగ‌ల్ తూర్పులో న‌రేంద‌ర్ వ‌ర్సెస్ వ‌ద్దిరాజు

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై హైటెన్షన్ నెల‌కొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే న‌రేంద‌ర్ వైపే ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుండ‌గా, రాజ్య స‌భ స‌భ్యుడు వ‌ద్దిరాజు ర‌విచంద్రను సైతం బ‌రిలో నిలిపేందుకు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. హ‌న్మకొండ‌లోని ఓ హోట‌ల్‌లో ఆయ‌న కుటుంబ స‌భ్యుల ఆధ్వర్యంలో కొంత‌మంది ఉద్యమ‌కారులు, బీఆర్ఎస్ నేత‌లు మీటింగ్ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ర‌విచంద్ర ఓపినియ‌న్ తీసుకున్నట్లు స‌మాచారం.

గ‌తంలో కాంగ్రెస్ నుంచి బ‌రిలో నిలిచి ర‌విచంద్ర ఓట‌మిపాల‌య్యారు. మారిన రాజ‌కీయ ప‌రిణామాల్లో బీఆర్ఎస్ గూటికి చేరుకుని అన‌తికాలంలోనే రెండేళ్ల కాలానికి రాజ్యస‌భ ప‌ద‌విని దక్కించుకోవ‌డం విశేషం. తాజాగా ఆయ‌న్ను నిల‌బెడితే తామంతా స‌హ‌క‌రిస్తామ‌ని ఎమ్మెల్సీ సార‌య్య, మేయ‌ర్ గుండు సుధారాణి కూడా మ‌ద్దతు తెలుపుతున్నట్లుగా బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది.

డోర్నక‌ల్‌లో హోరాహోరీ..!

డోర్నక‌ల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌, ఎమ్మెల్సీ, మంత్రి సత్యవ‌తి రాథోడ్ మ‌ధ్య టికెట్ పోరు కొన‌సాగుతోంది. అయితే రెడ్యాకే టికెట్ క‌న్ఫార్మ్ అయిన‌ట్లుగా ప్రచారం జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో మంత్రి స‌త్యవ‌తి రాథోడ్ సైతం ఆశ‌లు పెట్టుకున్నారు. స‌త్యవ‌తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన నేప‌థ్యంలో ఆమె కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి విధేయ‌త‌గా ఉండాల‌ని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు మ‌హ‌బూబాబాద్ లేదంటే ములుగులో బ‌రిలో నిలిపితే ఎలా ఉంటుంద‌ని కూడా కేసీఆర్ భావిస్తున్నట్లు స‌మాచారం.

మ‌హబూబాబాద్‌లో శంక‌ర్‌నాయ‌క్‌కే అవ‌కాశ‌మా..?!

మ‌హ‌బూబాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు ఎంపీ మాలోతు క‌విత‌, స‌త్యవ‌తి రాథోడ్ నుంచి టికెట్ పోరు ఉంది. అలాగే కొత్త క్యాండిడేట్‌ను బ‌రిలో నిల‌పాల‌న్న డిమాండ్‌ను స్థానికంగా ఉండే కొంత‌మంది లీడ‌ర్లు తీసుకువ‌చ్చారు. అయితే కొత్త క్యాండిడేట్ ఎవ‌ర‌న్నది కూడా చూప‌క‌పోవ‌డంతో ఈ ముగ్గురిలోనే ఎవ‌రికో ఒక‌రికి టికెట్ ద‌క్కుతుంద‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. అయితే డోర్నక‌ల్‌లో తండ్రి రెడ్యానాయ‌క్‌కు టికెట్ కేటాయింపు ఉంటుంద‌న్న చ‌ర్చ నేప‌థ్యంలో క‌విత‌కు అసెంబ్లీ స్థానం కేటాయింపు ఇవ్వక‌పోవ‌చ్చన్న వాద‌న ఉంది.

స‌త్యవ‌తి లేదా శంక‌ర్‌నాయ‌క్‌ల్లోనే టికెట్ కేటాయింపు జ‌రుగుతుంద‌న్న విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా కేసీఆర్ ఆశీర్వచ‌నం త‌న‌కు ల‌భించింద‌ని ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ త‌న‌కు స‌న్నిహితులైన వారితో కాన్ఫిడెంట్‌గా చెబుతుండ‌టంతో ఆయ‌న వ‌ర్గీయుల్లో సంతోషాలు వ్యక్తమ‌వుతున్నాయి.

ములుగులో బ‌డే నాగేజ్యోతికేనా..?

ములుగు నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా జ‌డ్పీ చైర్‌ప‌ర్సన్‌, ఆదివాసీ మ‌హిళ బ‌డే నాగ‌జ్యోతిని బ‌రిలో దింపేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నట్లు స‌మాచారం. కొద్దిరోజుల క్రితం గిరిజ‌నుల‌కు పోడు భూముల‌ ప‌ట్టాల పంపిణీ కార్యక్రమం ములుగు నిర్వహించ‌గా ఇందుకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి స‌త్యవ‌తిరాథోడ్‌తో స‌మానంగా ఆమెకు ప్రాధాన్యం క‌ల్పించ‌డం విశేషం.

మంత్రి ప‌ర్యట‌న త‌ర్వాత బ‌డే నాగ‌జ్యోతి ములుగు జిల్లాతో పాటు మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని ములుగు నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన కొత్తగూడ‌, గంగారం మండ‌లాల్లోనూ ప‌ర్యటిస్తుండ‌టం ఆమెకు అధిష్ఠానం నుంచి అందిన సంకేతాల‌కు నిద‌ర్శనంగా బీఆర్ఎస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఆదివాసీ మ‌హిళా అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్కను ఢీకొట్టాలంటే మావోయిస్టు కుటుంబ నేప‌థ్యం ఉన్న బ‌డే నాగ‌జ్యోతిని ప్రొత్సహించాల‌ని వ్యూహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

భూపాల‌ప‌ల్లిపై చారి, ప‌ర‌కాల‌పై నాగుర్ల ఆశ‌లు

భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గు చూప‌గా ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి కూడా ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌నకే టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న వ‌ర్గీయులు గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్నారు. ఆదివారం సైతం భూపాల‌ప‌ల్లిలో ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు కొన‌సాగాయి. ప‌ర‌కాలలో చ‌ల్లా ధ‌ర్మారెడ్డికే టికెట్ ఖ‌రారు చేసే యోచ‌న‌లో అధిష్ఠానం ఉండ‌గా తెలంగాణ రాష్ట్ర రైతు విమోచ‌న క‌మిష‌న్ చైర్మన్‌గా ఉన్న నాగుర్ల వెంక‌టేశ్వర్లు సైతం టికెట్ త‌న‌కు వ‌స్తుంద‌నే న‌మ్మకంతో ఉండ‌టం గ‌మ‌నార్హం. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 21 టికెట్ల కేటాయింపున‌కు సంబంధించి తొలి జాబితాను విడుద‌ల చేస్తార‌ని తెలుస్తుండ‌టంతో టికెట్లెవ‌రికి ద‌క్కుతాయి.. ఎవ‌రికి అసంతృప్తి మిగులుతుంద‌నే వాద‌న‌లు, విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి.

Next Story

Most Viewed