'ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు'.. పీఎసీఎస్ వైస్ చైర్మన్‌పై పోలీసులకు ఫిర్యాదు

by Disha Web Desk 13 |
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు.. పీఎసీఎస్ వైస్ చైర్మన్‌పై పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, జనగామ: కంచనపల్లి పీఎసీఎస్ వైస్ చైర్మన్‌ మూడు ధర్మ అక్రమాలకు పాల్పడ్డాడంటూ శనివారం పలువురు రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లో్కి వెళితే.. గత 3 ఏళ్లుగా వైస్ ఛైర్మెన్, ధాన్యం కొనుగోలు బాధ్యతలు నిర్వర్తిస్తూ.. రైతుల ధాన్యం కాంటా పెట్టిన తర్వాత తూకంలో మోసాలకు పాల్పడుతున్నాడని రైతులు వారి ఫిర్యాదులు పేర్కొన్నారు. ప్రతి లారీకి రెండు నుంచి మూడు క్వింటాళ్ల ధాన్యాన్ని కోత విధించి అలా పోగు చేసిన ధాన్యం తన భార్య పేరు మీద కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లు రైతులు తెలిపారు.

గత మూడేళ్లుగా లక్షలాది రూపాయల విలువైన ధాన్యాం సొమ్మును భార్య ఖాతాలో మళ్ళించడం జరిగిందని వారు వాపోయారు. తనకు ఉన్న భూమిలో పండిన ధాన్యం క్వింటాలలో ఉంటే, భార్య ఖాతాలోకి వందల క్వింటాళ్ల ధాన్యం డబ్బులు ఎలా జమ అవుతాయని వారు ప్రశ్నించారు. మూడు ధర్మ తీరుపై అనుమానం వ్యక్తం చేసిన పలు గ్రామాల రైతులు గత ఏడాది కంచనపల్లి సహకార సంఘంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు, చైర్మన్, డైరెక్టర్లు పట్టించుకోలేదని, విచారణకు వచ్చిన అధికారులను మచ్చిక చేసుకుని తప్పుడు నివేదికలు వచ్చే విధంగా చేశాడని కూడా వారు ఆ ఫిర్యాదులు పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి మూడు ధర్మ తన భార్య ఖాతాలోకి మళ్ళించిన సొమ్మును రైతులకు ఇప్పించాల్సిందిగా వారు కోరారు. అదేవిధంగా అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు.

Next Story