ప‌ర్వ‌తగిరిలో య‌థేచ్ఛ‌గా మ‌ట్టి మాఫియా .. పట్టించుకునేవారే కరువు

by Dishanational2 |
ప‌ర్వ‌తగిరిలో య‌థేచ్ఛ‌గా మ‌ట్టి మాఫియా .. పట్టించుకునేవారే కరువు
X

దిశ‌, పర్వతగిరి : వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వత‌గిరి మండ‌లంలోని ప‌లు గ్రామ చెరువుల నుంచి మ‌ట్టి దందా య‌థేచ్ఛగా సాగుతోంది. ఈ దందాకు పాల్పడుతున్న వారిలో అధికార పార్టీకి చెందిన నాయ‌కులే అధికంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. అంతేకాదు ఎమ్మెల్యే అనుచ‌రులమంటూ చెలామ‌ని అవుతున్న కొంతమంది ఏకంగా పోలీసుల‌ను సైతం బెదిరింపుల‌కు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప‌ర్వత‌గిరి మండ‌ల‌కేంద్రం పెద్ద చెరువు(రిజ‌ర్వాయ‌ర్‌), క‌ల్లెడ చెరువు, అనంతారం గ్రామ శివారులోని రాయ‌కుంట నుంచి నిర్విరామంగా రాగడి మ‌ట్టిని అక్రమంగా ర‌వాణా చేస్తున్నారు. మూడు ప్రాంతాల్లోని జ‌ల‌శ‌యాల నుంచి ఇప్పటికే సుమారు కోటి రూపాయ‌ల విలువ చేసే మ‌ట్టిని మాయం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

అడ్డుకోవడానికి వచ్చిన గ్రామస్థులతో అసభ్యకరమైన పదాజలంతో తిడుతూ.. వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పర్వతగిరి మాజీ జడ్పీటీసీ ఒక‌రు, ప్రస్తుత స్థానిక సర్పంచ్‌లు ఇద్దరు క‌లిసి ఈ దందా నడుపుతున్నారనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. చెరువుల నుంచి రాగ‌డి మ‌ట్టిని ఇటుక బ‌ట్టీల‌కు అమ్ముతున్నారు. రాగడీ మట్టి టిప్పర్‌కు రూ.4000 నుంచి 6000 కుఅమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇరిగేష‌న్, మైనింగ్‌ అధికారులెక్కడా..?

ఎలాంటి అనుమ‌తుల్లేకుండా సాగుతున్న మ‌ట్టి దందాను అడ్డుకోవాల్సిన ఇరిగేష‌న్‌, మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్ అధికారులు పెద్దగా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఇరిగేష‌న్‌, రెవెన్యూ అధికారులు అండ‌దండ‌ల‌తోనే మ‌ట్టిదందా సాగుతున్నట్లుగా ఆయా గ్రామాల్లోని ప్రజ‌లు చెబుతున్నారు. ఎక్స్‌క‌వేట‌ర్లతో సాయంతో రాత్రన‌కా ప‌గ‌ల‌న‌కా తవ్వకాలు చేపట్టి పదుల సంఖ్యలో టిప్పర్లో త‌ర‌లిస్తున్నారు. పర్వతగిరి మండలంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్, కొందరిది పగలు, మరికొందరిది రాత్రి వ్యాపారం నడిపిస్తూ బహిరంగంగా రాగడి మట్టిని తవ్వి లారీల్లో, టిప్పర్లో, ట్రాక్టర్‌లో మేన్ రోడ్ గుండా తరలిస్తున్న అధికారులకు కనపడటం లేదా, అనేది ప్రశ్న ఈ అక్రమ వ్యాపారం బహిరంగంగానే జరుగుతున్న, అధికారులు ఎక్కడా చర్యలు ఎందుకు చేపట్టడం లేదో అని అనుమానం సగటు పౌరునికి కలుగుతుంది.

దెబ్బతింటున్న రోడ్లు.. చెరువుల్లో గుంత‌లు

మ‌ట్టి మాఫియా జ‌ల‌శ‌యాల్లో ఇష్టారాజ్యంగా త‌వ్వకాలు జ‌రుపుతుండ‌టంతో ఆన‌క‌ట్టల‌కు ప్రమాదం పొంచి ఉంద‌ని ఆయా గ్రామాల ప్రజ‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. వర్షకాలంలో చెరువులో నీరు ఎక్కడిక్కడే నిలిచిపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు, ప్రజలు ఆ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎక్కువగోతులు ఉండడం వల్ల చెరువు నీరు తూము వద్దకు చెరుకోకుండా దూరంగానే నిలిచిపోయి సాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు లేకపోలేదని గుర్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed