స్కూల్ భవనంపై నుంచి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

by Disha Web Desk 13 |
స్కూల్ భవనంపై నుంచి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు
X

దిశ, భీమదేవరపల్లి/ఎల్కతుర్తి: మోడల్ స్కూల్ భవనం పై నుంచి విద్యార్థి కిందపడి గాయాల పాలైన ఘటన మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థి తండ్రి గబ్బెట రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దామెర గ్రామానికి చెందిన అఖిల్ ఎల్కతుర్తి మోడల్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నాడు. శనివారం రోజు ఉదయం స్కూలుకు వెళ్లిన అఖిల్ మోడల్ స్కూల్ భవనం పైకి ఎక్కి భవనానికి ఆనుకుని ఉన్న రేగు చెట్టు పండ్లు అందుకోవడానికి ప్రయత్నించి అక్కడ నుండి కింద పడ్డాడు. దీంతో విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి.


సృహ కోల్పోయి కింద పడిపోయిన అఖిల్ ను తోటి విద్యార్థులు చూసి ఉపాధ్యాయులకు తెలియజేయగా 108 అంబులెన్స్ లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ప్రథమ చికిత్సలో భాగంగా స్కానింగ్ లు తీసి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. అనంతరం నోటి నుండి రక్తస్రావం రావడం తో హనుమకొండ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి తలకి శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే తన కుమారుడికి ఇలాంటి దుస్థితి కలిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జరిగిన ఘటనపై ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం..

మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే ప్రమాద ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పాఠశాల భవనం పైకి ఎక్కే డోర్ పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ ఘటన జరిగినట్లు విద్యార్థులు తెలుపుతున్నారు. జరిగిన సంఘటన పై ప్రిన్సిపల్ సునీత ను వివరణ కోరగా ఉదయం పాఠశాల సమయం ముందే విద్యార్థులను పంపిస్తున్నారని అందువల్లే ఇలా జరిగిందని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం గమనార్హం.

ఇదిలా ఉండగా పాఠశాల కాంపౌండ్ లోనే నీటి కుంట ఉంది. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. భవనంపై వాటర్ ట్యాంక్ నిండిన తర్వాత బిల్డింగ్ పై వాటర్ నిలిచాయి. అధికారులు జరిగిన ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


Next Story

Most Viewed