సీఎం ప్రక‌ట‌నతో పంట న‌ష్టంపై స‌ర్వే షురూ

by Dishanational1 |
సీఎం ప్రక‌ట‌నతో పంట న‌ష్టంపై స‌ర్వే షురూ
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: సాధ్యమైనంత త్వర‌గా పంట న‌ష్టం ప‌రిహారం రైతుల‌కు అందేలా చూస్తామ‌ని సీఎం కేసీఆర్​రైతుల‌కు మాటిచ్చిన నేప‌థ్యంలో, ఆ హామీని నిల‌బెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని ఆరుగురు క‌లెక్టర్లు, వ్యవ‌సాయ‌శాఖ జిల్లా అధికారుల‌పై ప‌డింది. క‌లెక్టర్లకు, వ్యవ‌సాయ‌శాఖ అధికారుల‌కు కింక‌ర్తవ్యంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంట న‌ష్టంపై స‌ర్వేకు వ్యవ‌సాయ శాఖ అధికారులు స‌న్నద్ధమ‌వుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 2 ల‌క్షల ఎక‌రాల్లో సాగవుతున్న వివిధ ర‌కాల పంట‌లకు న‌ష్టం వాటిల్లిన‌ట్లుగా అధికారులు ప్రాథ‌మిక అంచ‌నా వేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ అంచ‌నాల్లో కొంత వైరుద్యం కూడా ఉంది. వ‌రంగ‌ల్ జిల్లా దుగ్గొండి మండ‌లం అడ‌వి రంగాపురం, మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని పెద్దవంగ‌ర మండ‌లం ఆర్ కే తండాలో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప‌ర్యటించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా పంట న‌ష్టపోయిన రైతుల‌తో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఎక‌రా పంట న‌ష్టానికి రూ.10 వేలు ప‌రిహారంగా అంద‌జేయ‌నున్నట్లుగా తెలిపారు. అదీ కూడా సాధ్యమైనంత త్వర‌గా అంద‌జేస్తామ‌ని రైతుల‌కు సీఎం మాటిచ్చారు. ఈ నేప‌థ్యంలో స‌ర్వేను వేగిరంగా పూర్తి చేయాల్సిన టాస్క్ వ్యవ‌సాయ శాఖ అధికారుల ముందు ఉండ‌డం గ‌మ‌నార్హం.

33 శాతం పంట న‌ష్టమే ఎంపిక‌కు ప్రతిపాదిక‌...

పంట న‌ష్టం అంచ‌నాకు, బాధిత‌ రైతుల‌ను ప‌రిహారం జాబితాలో చేర్చడానికి 33 శాతం పంట న‌ష్టాన్నే అధికారులు ప్రాతిపదిక‌గా తీసుకోనున్నారు. అంటే వేసిన పంట‌లో 33 శాతానికి మించి న‌ష్టం జ‌రుగుతుందో ఆ పంటను, రైతుల పేర్లను ప‌రిహారం జాబితాలో చేర్చుతారు. జిల్లా స్థాయి అధికారుల ప‌ర్యవేక్షణ‌లో మండ‌ల వ్యవ‌సాయ శాఖ అధికారులు పంట న‌ష్టాన్ని గుర్తిస్తారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా పంట న‌ష్టం జ‌రిగిన‌ప్పటికీ వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ‌, మ‌హ‌బూబాబాద్ ఎక్కువ‌గా ములుగు, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జ‌న‌గామ జిల్లాల్లో కొంచెం త‌క్కువ‌గా జ‌రిగిన‌ట్లుగా వ్యవ‌సాయ శాఖ అధికారుల‌కు అందిన రిపోర్టు ఆధారంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌న‌గామ‌, ములుగు, జ‌య‌శంక‌ర్ జిల్లాల‌కు చెందిన వ్యవ‌సాయ శాఖ అధికారుల‌ను మిగ‌తా మూడు జిల్లాల్లో పంట న‌ష్టం అంచ‌నా వేసేందుకు స్పెష‌ల్ డ్యూటీకి నియ‌మించే అవ‌కాశాలున్నట్లు స‌మాచారం.

ప్రాథ‌మిక అంచ‌నాల్లో గంద‌ర‌గోళం!

ప్రాథ‌మిక అంచ‌నాలో అధికారుల్లో గంద‌ర‌గోళం ఉన్నట్లుగా స్పష్టమ‌వుతోంది. గురువారం ముఖ్యమంత్రికి అంద‌జేసిన నివేదిక‌ల్లో పంట న‌ష్టం అంచ‌నా లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లుగా శాఖ అధికారుల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో 50 వేల ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగిన‌ట్లుగా, మ‌రో నివేదిక‌లో 2 ల‌క్షల ఎక‌రాల వ‌ర‌కు పంట న‌ష్టం జ‌రిగిన‌ట్లు అంచ‌నా వేసిన‌ట్లుగా నివేదిక‌లు రూపొందించి సీఎం కేసీఆర్ వ‌ద్దకు తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. పంట న‌ష్టంపై స‌ర్వేకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయ‌క‌పోవ‌డంతో ఆయా జిల్లాల వారీగా వ్యవ‌సాయ శాఖ అధికారులు ఏవోల నుంచి ర‌మార‌మి అంచ‌నాల‌తో నివేదిక‌లు రూపొందించిన‌ట్లుగా తెలిసింది. కొన్ని చోట్ల అదీ జ‌ర‌గ‌లేదు. దీంతో స‌రైన‌ అంచ‌నాల‌తో నివేదిక‌లు రూపొంద‌లేద‌న్న చ‌ర్చ శాఖ అధికారుల మ‌ధ్యే జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం.

ఇవి కూడా చదవండి:

ఆసక్తికరంగా సీఎం కేసీఆర్ పర్యటన

పాత తరమా..!? యువతరమా..!?



Next Story

Most Viewed