నాలుగేళ్లు పని చేయకున్నా ఓ ఉద్యోగికి జీతం

by Disha Web Desk 8 |
నాలుగేళ్లు పని చేయకున్నా ఓ ఉద్యోగికి జీతం
X

దిశ,వరంగల్ టౌన్: భాషా! బల్దియా బడా బాద్ షా !! నాలుగేళ్లు పనిచేయకున్నా జీతం తీసుకున్నాడు.ఈ విషయం ఆ నోట ఈ నోట బయటకు పొక్కడంతో తాజాగా విధుల్లో చేరాడు. ఇది వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారుల ఔదార్యానికి నిదర్శనం. ఇప్పటికే అవినీతి, అక్రమాలకు, విధుల పట్ల నిర్లక్ష్యానికి నిలువుటదంగా నిలుస్తున్న గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ తాజా నిర్వాహకం! ఇదేమిటని ప్రశ్నిస్తే అధికారుల నుంచి విచిత్ర సమాధానం ఎదురవడం గమనార్హం.

అసలు ఏం జరిగిందంటే...

వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యక్తి కొన్ని ఏళ్ల క్రితం వరంగల్ బల్దియా పబ్లిక్ హెల్త్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా చేరాడు. కొంతకాలం సజావుగా విధులు నిర్వహించిన సదరు ఉద్యోగి అనారోగ్యానికి గురయ్యాడని, అతను విధులకు రాలేకపోతున్నాడని ఈ విషయాన్ని అప్పటి బల్దియా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరి అప్పటి కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో? అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారో గానీ, ఆనాటి నుంచి విధులకు రాకపోయినా ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు వేతనం తీసుకున్నాడు.ఈ వ్యవహారమంతా బల్దియాకు చెందిన ఓ డిప్యూటీ కమిషనర్ కనుసన్నల్లో జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో మే,జూన్ నెలలు జీతాన్ని అదికారులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సదరు ఉద్యోగి రెండు నెలల క్రితం విధుల్లో చేరినట్లు తెలుస్తోంది.ఈ మేరకు రెండు నెలల వేతనం మంజూరు అయినట్లు ఆధారాలు తేటతెల్లం చేస్తున్నాయి.

వాస్తవ కథ ఏమిటంటే!

అనారోగ్యానికి గురైన సదరు ఉద్యోగి స్థానంలో అతని భార్య ఇంత కాలం పని చేసినట్లు ప్రచారంలో ఉంది. కాజీపేట సర్కిల్ పరిధిలో ఓ మీ సేవ కేంద్రంలో విధులు నిర్వహించినట్లు బల్దియాలో ఇప్పటికీ వాదనలు వినిపిస్తున్నాయి.పని ఆమె చేసినప్పటికీ వేతనం మాత్రం భర్త (సదరు ఉద్యోగి) పేరు మీదే జారీ చేసినట్లు బల్దియా రికార్డులు వెల్లడిస్తున్నాయి.ఈ విషయమై 'దిశ' దినపత్రిక గతంలో వరస కథనాలు ప్రచురించింది.దీంతో తేరుకున్న బల్దియా అధికారులు పలువురికి మెమోలు కూడా జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.ఈ వ్యవహారంపై 'దిశ" దినపత్రిక కాజీపేట సర్కిల్ కు చెందిన డిప్యూటీ కమిషనర్ జోనను వివరణ కోరగా,సదరు ఉద్యోగి విషయంలో తీసుకున్న నిర్ణయం తనది కాదని,అప్పటి కమిషనర్ ఆదేశాలనీ,అతని స్థానంలో భార్యను విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు కూడా జారీ చేశారని చెప్పారు. కానీ,అందుకు సంబంధించిన ఆధారాలను బయట పెట్టలేకపోయారు.ఇదిలా ఉండగా సదరు ఉద్యోగి విషయం బయటకు పొక్కిన వెంటనే మెమోలు జారీ చేసిన అధికారులు... తాజాగా భార్య స్థానంలో ఇప్పుడు భర్తను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి.అయితే దీనిపై బల్దియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకాలం బాగోలేదన్న వ్యక్తి, ఆఫీసులో కనిపించని వ్యక్తి సడెన్ గా విధులు నిర్వహించడం ఆశ్చర్యానికి గురయ్యారు.అనారోగ్యం కారణం చూపి భార్యతో పని చేయించి మళ్లీ ఉద్యోగంలో చేరే అవకాశం మున్సిపల్ చట్టంలో ఉందా? అంటూ చర్చించుకుంటున్నారు.నిజంగా అలాంటి అవకాశమే ఉంటే తాము కూడా అలాగే చేసేవాళ్లం కదా అని మాట్లాడుకుంటున్నారు.

నాకు తెలియదు.. సీఎంహెచ్వో డాక్టర్ రాజేష్

ఇంతకాలం ఏమి జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు. పత్రికలో కథనం వచ్చిన తర్వాత నా పరిధిలోని విభాగానికి చెందిన సదరు ఉద్యోగిని విధుల్లోకి తీసుకున్నాను. అంతకుముందు వేతనాలు అటెండెన్స్ నమోదు అంతా అడిషనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ లకు తెలుసు వారిని అడుగుతే పూర్తి సమాచారం తెలుస్తుంది.

నా దృష్టికి రాలేదు.. షేక్ రిజ్వాన్ భాషా కమిషనర్ జీడబ్ల్యూఎంసీ

ఈ విషయమై జిడబ్ల్యూఎంసి కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషాను వివరణ కోరగా ఇంకా తన దృష్టికి రాలేదని వయసు మీద పడి తీవ్ర అనారోగ్యానికి గురైతే అలాంటి అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ వ్యవహారంపై వివరాలు సేకరించి,విచారణ చేపడతామని వెల్లడించారు.

మరెంతమంది!

ఇదిలా ఉండగా బల్దియాలో ఇతను ఒక్కడే కాకుండా చాలామంది ఇదే తరహాలో పనిచేయకున్నా నెలనెలా వేతనం తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో పలువురి కార్పోరేటర్ ల కుమారులు, బంధువులు ఉండడం వల్ల అధికారులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.



Next Story