శభాష్ పోలీస్‌..బ్యాంకు దొంగ‌ల‌ను వెంటాడిన వ‌రంగ‌ల్ ఖాకీలు

by Aamani |
శభాష్ పోలీస్‌..బ్యాంకు దొంగ‌ల‌ను వెంటాడిన వ‌రంగ‌ల్ ఖాకీలు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌లకేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో దొంగ‌త‌నానికి పాల్ప‌డిన ముఠాలోని ముగ్గురి స‌భ్యుల‌ను అరెస్టు చేసిన వ‌రంగ‌ల్ పోలీసుల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. శభాష్ పోలీస్ అంటూ అభినందిస్తున్నారు. గ‌త నెల 18న అర్ధ‌రాత్రి స‌మ‌యంలో రాయ‌ప‌ర్తి ఎస్‌బీఐ బ్యాంకులోని లాక‌ర్ల‌ను ధ్వంసం చేసి కోట్ల విలువ చేసే బంగారు ఆభ‌ర‌ణాల‌ను అంతఃరాష్ట్ర ముఠా దోచుకెళ్లింది.ఈ ఘ‌ట‌న‌తో బ్యాంకు అధికారులు, ఖాతాదారులు,పోలీసులు షాక్‌కు గుర‌య్యారు. ఎంతో భ‌ద్ర‌త‌క‌లిగి ఉండే బ్యాంకునే కేటుగాళ్లు టార్గెట్ చేసి.. దోచుకెళ్ల‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. ఈ కేసును రాష్ట్ర పోలీస్‌శాఖ సీరియ‌స్‌గా తీసుకుంది.


ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది గంట‌ల్లోనే వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిశోర్ ఝా ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశారు. వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ నేతృత్వంలో వర్థన్నపేట ఏసీపీ నర్సయ్య, సీసీఎస్ ఏసీపీ భోజరాజు, నర్సంపేట ఏసీపీ కిర‌ణ్‌కుమార్ ల ఆధ్వర్యంలో పదికిపైగా ప్రత్యేక బృందాలు ఇన్వేస్టిగేష‌న్‌లో భాగ‌మ‌య్యాయి. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. ద‌ర్యాప్తులో పురోగ‌తి సాధించారు. గ‌తంలో ఈ త‌ర‌హా దొంగ‌త‌నాలు చేసిన ముఠాల వివ‌రాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ముఠా స‌భ్యుల ప‌నేన‌ని గుర్తించి ముగ్గురి అరెస్టు చేయ‌గ‌లిగారు. టెక్నాల‌జీని వినియోగించుకుంటూ మ‌రీ బ్యాంకుకు క‌న్నం వేసిన కేటుగాళ్ల‌ను..అదే టెక్నాల‌జీ సాయంతో చిక్కారు. ఘ‌ట‌న జ‌రిగిన మ‌రుక్ష‌ణం నుంచి వేట మొద‌లు పెట్టిన వ‌రంగ‌ల్ ఖాకీలు..చివ‌రికి కేటుగాళ్ల‌లో ముగ్గురిని క‌ట‌క‌టాల వెన‌క్కి పంప‌గ‌లిగారు. మిగ‌తా న‌లుగురి అరెస్టుకు గాలింపును ముమ్మ‌రం చేశారు.

Advertisement

Next Story

Most Viewed